పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘కల్కి’. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమా ఇది. ఇది పాన్ వరల్డ్ సినిమా అని సెట్స్ పైకి వెళ్లడానికి ముందే నాగ్ అశ్విన్ చెప్పాడు. దాంతో ప్రభాస్ అభిమానులందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది.
ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక భారీ సెట్ ను నిర్మిస్తున్నారట. ఇంటర్వెల్ బ్యాంగ్ కి సంబంధించిన ఒక యాక్షన్ సీన్ ను ఈ సెట్లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఈ సీన్ నుంచే కథ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందని అంటున్నారు. ఇందుకోసం పెద్ద మొత్తంతో ఖర్చు చేస్తున్నట్టుగా చెబుతున్నారు.
ప్రభాస్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న ఈ సినిమాలో ఆయన జోడీగా దీపిక పదుకొణె కనిపించనుండగా, కీలకమైన పాత్రలను అమితాబ్ – కమల్ పోషిస్తున్నారు, ముఖ్యమైన పాత్రలలో దుల్కర్ సల్మాన్ – దిశా పటాని కనిపించనున్నారు. వచ్చే ఏడాది మే 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.