ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇప్పటికే సలార్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో అదిరిపోయే అప్‌డేట్ అవుతుంది. ప్రభాస్ నెక్ట్స్ మూవీ కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ గురించి వార్త చక్కర్లు కొడుతోంది. అశ్వినీదత్‌కు చెందిన వైజయంతీ మూవీస్‌కు బాగా కలిసొచ్చిన మే 9న కల్కి రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తేదీన రిలీజైన వైజయంతీ మూవీస్ సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి.
జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ 1990, మే 9న రిలీజై టాలీవుడ్ చరిత్రలో రికార్డు క్రియేట్ చేసింది. ఆ సినిమా అప్పట్లోనే బాక్సాఫీస్ దగ్గర రూ.15 కోట్లు వసూలు చేసింది. చిరంజీవి కెరీర్లో మైలురాయి లాంటి సినిమా అయింది. చాలా రోజుల తర్వాత వైజయంతీ మూవీస్‌కు మరో పెద్ద హిట్ ఇచ్చిన మహానటి సినిమా కూడా అదే మే 9న రిలీజైంది.
సుమారు రూ.600 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీని కూడా సెంటిమెంట్ ప్రకారం అదే రోజు రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అయితే గ్రాఫిక్స్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరో 3 నెలల్లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఈ మధ్యే బాంబే ఐఐటీలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పాడు.
దానిప్రకారం ఏప్రిల్‌లో కల్కి 2898 ఏడీ మూవీ ట్రైలర్ వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత త్వరగా గ్రాఫిక్స్ పనులు పూర్తి చేసి అదే రోజున రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ సంక్రాంతికి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఈ ఏడాది సంక్రాంతికే కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ అవుతుందని మొదట భావించారు. కానీ గ్రాఫిక్స్ పనులు ఆలస్యం అవుతుండటంతో అది రిలీజ్ సాధ్యం కాలేదు. రెండేళ్లకు పైగా షూటింగ్ జరుగుతూనే ఉంది. చాలా రోజుల పాటు ప్రాజెక్ట్ కేగా పిలిచిన ఈ మూవీకి గతేడాది టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా అప్‌డేట్ కూడా ఈ సంక్రాంతికి వెలువడే అవకాశం వుంది. మారుతితో కలిసి ప్రభాస్ చేస్తున్న మూవీకి సంబంధించి టైటిల్, ఇతర అప్‌డేట్స్ మేకర్స్ ఇవ్వనున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్‌కు వరుస సర్‌ప్రైజ్‌లతో ఈ సంక్రాంతి మరింత స్పెషల్ కానుంది.