‘బాహుబలి’ మూవీ తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’. శ్రద్ధాకపూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది.
ప్రస్తుతం ‘సాహో’ ట్రైలర్‌ను చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని అంటున్నారు. ట్రైలర్ విడుదల వేడుకలో ఇదే విషయమై ప్రభాస్‌ను ‘ఈ సినిమా బడ్జెట్ బాహుబలిని దాటిందా?’ అని అడిగితే ‘అవును దాటింది’ అని సమాధానం ఇచ్చాడు. తొలుత ‘సాహో’ ను రూ.250కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు అప్పట్లో చిత్ర వర్గాలు తెలిపాయి. ఇప్పుడు అదనంగా మరో రూ.100కోట్లు దాటినట్లు సమాచారం. ఒక అబుదాబి షెడ్యూల్ కోసమే రూ.80కోట్లు ఖర్చు చేశారని సమాచారం.
చాలా సన్నివేశాలను సహజంగా తెరకెక్కించారట నిజమేనా? అన్న ప్రశ్నకు ప్రభాస్ సమాధానం ఇస్తూ, ‘అవును ప్రస్తుత కాలంలో అది అవసరం. నేను గాల్లో ఎగరడం మీరు ట్రైలర్‌లో చూశారు. అలాగే గులాబీ వర్ణంలో ఉన్న సరస్సు కూడా ట్రైలర్‌లో కనిపిస్తుంది. అది ఆస్ట్రేలియాలో ఉంది. ఇలా చాలా సన్నివేశాలను గ్రాఫిక్స్‌తో కాకుండా సహజంగా తీశాం. ప్రపంచంలో అత్యుత్తమంగా ఉన్న వాటన్నింటినీ ఒక చోటుకు చేర్చాం’ అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.
యూవీ క్రియేషన్స్ పతాకంపై వి. వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, భూషన్‌కుమార్‌లు ఈ సినిమాను నిర్మించారు. తనిష్క్ బాగ్చి, గురు రాఘవ, జిబ్రాన్(నేపథ్య) సంగీతం అందించారు. జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, వెన్నెల కిషోర్, మహేశ్ మంజ్రేకర్, మందిరాబేడీ, మురళీ శర్మ, అరుణ్‌విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.