Prabhas Wayanad Victims:
వరదల కారణంగా విరిగిపడిన కొండ చరియలు కేరళలోని వయనాడ్ జిల్లాని అతలాకుతలం చేసేసాయి. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కలేనంత మంది గాయపడ్డారు. చాలామంది నిరాశ్రయులు అయ్యారు. ఈ నేపథ్యంలో చాలామంది తమ వంతుగా ఆర్థిక సహాయం చేశారు. మలయాళం తో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా మేమున్నాము అంటూ ముందుకు వచ్చారు.
తాజాగా ఈ జాబితాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా చేరారు. వయనాడ్ బాధితుల సహాయార్థం డార్లింగ్ ప్రభాస్ రెండు కోట్ల భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించి.. తన దయ గుణాన్ని చాటుకున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ 25 లక్షల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పది లక్షల రూపాయలు, చిరంజీవి రామ్ చరణ్ కలిపి కోటి రూపాయలు విరాళాలు ప్రకటించారు.
తమిళ్ ఇండస్ట్రీ నుంచి విక్రమ్ 20 లక్షలు విరాళంగా ఇచ్చారు. నయనతార ఆమె భర్త విగ్నేష్ శివన్ కలిసి 20 లక్షల ఆర్థిక సహాయం చేశారు. సూర్య తన భార్య జ్యోతిక కలిసి 50 లక్షల విరాళం ప్రకటించారు.
కేరళలో జరిగిన ఈ విపత్తు పునరావాస కార్యక్రమాల కోసం మలయాళం నటులు కూడా ముందుకు వచ్చారు. సూపర్ స్టార్ మోహన్ లాల్ స్వయంగా వయనాడ్ వెళ్లి అక్కడి పరిస్థితులు చూసి.. సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.
మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కలిసి 35 లక్షల విరాళం ఇచ్చారు. “సహాయ చర్యల కోసం తన వంతు చిన్న సహాయం చేశానని, ఇంకా అవసరం ఉంటే, మరింత సహాయం చేస్తాను” అని అన్నారు మమ్ముట్టి.
స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్, ఆయన భార్య నజ్రియా నజీమ్ కూడా రూ. 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. “ఈ కఠిన పరిస్థితుల్లో తమ సహాయం వారికి ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
వయనాడ్ లో ఇంకా చాలా మంది ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం. రక్షణ చర్యలు ఇంకా జోరుగా కొనసాగుతున్నాయి. సెలబ్రిటీలు, మామూలు ప్రజల నుండి వచ్చిన భారీ విరాళాలు బాధితుల సహాయం కోసం వినియోగించనుంది కేరళ ప్రభుత్వం.