ఏ ఒక్కరినీ లక్ష్యంగా చేసుకొని ‘ముఖ్యమంత్రిగారూ మీరు మాటిచ్చారు’ సినిమా తీయలేదని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం పనితీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నేను ఏ సినిమా తీశానో ప్రకటించక ముందే.. అసలు ప్రచార చిత్రాలు కూడా బయటికి రాక ముందే.. ఒక నేతను దూషిస్తూ సినిమా తీశారనే ఫిర్యాదు అందిందంటూ ఎన్నికల సంఘం నాకు లేఖ పంపడం ఒక రాజ్యాంగ వ్యవస్థ చేయాల్సిన పనేనా?. ఎన్నికల సంఘంపై గౌరవంతో ‘ నేనెవరినీ దూషిస్తూ సినిమా చేయలేదని.. ‘ఆపరేషన్ దుర్యోధన’ లాగా సమకాలీన రాజకీయాల నేపథ్యంలో తీశానంటూ మూడు పేజీల లేఖ పంపినప్పటికీ, స్వయంగా అమరావతికి రావాలంటూ లేఖ పంపడంలో అర్థం ఏంటి?. ఈ రోజు చిత్తూరు నుంచి మోహన్‌రావు అనే వ్యక్తి మీకు లేఖ రాస్తే ఎన్నికల సంఘం నన్ను వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరుతోంది. రేపట్నుంచి ప్రతిరోజూ ఒకరు ఫిర్యాదు చేస్తారు. వాటన్నిటి కోసం నేను రోజూ అమరావతికి తిరుగుతుండాలా?’.
‘ఎన్నికలతో సంబంధం లేకుండా నేను ఆర్నెళ్ల ముందే ‘ముఖ్యమంత్రిగారూ మీరు మాటిచ్చారు’ అనే సినిమాని మొదలు పెట్టాను. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ఆ సినిమాని ఇంకా నేను కూడా చూసుకోలేదు. దాని గురించి మీడియా ముందు కూడా వివరాలు చెప్పలేదు. ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, వాళ్లలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా రూపొందించిన చిత్రమది. మా అబ్బాయి కథ, మాటలు రాశాడు. ఏ ఒక్కరినీ లక్ష్యంగా చేసుకొని తీసిన సినిమా కాదు. ఇందులో గెటప్పులు కూడా ఎవ్వరినీ పోలినట్టుగా ఉండవు. కానీ అందులో కొందర్ని దూషించారని ఆ సినిమా పేరు ‘ముఖ్యమంత్రిగారు మాట తప్పాడు’ అని తప్పుగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వ్యక్తిని ఆధారాలు అడగకుండానే, నాకు ఎన్నికల సంఘం లేఖ పంపింది. అసలు సినిమాలకీ, ఎన్నికల సంఘానికి ఎలాంటి సంబంధం లేదు. మేం ఏం తీయాలో, ఏం తియ్యకూడదో చెప్పేందుకు సెన్సార్ వ్యవస్థ ఉంది. మా సినిమాపై సెన్సార్ బోర్డుకి కూడా చెడు అభిప్రాయం ఏర్పడేలా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోంది’ అని ఆరోపించారు.