ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ ఉదయం 7 గంటలను నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆరంభంలో పోలింగ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ను ముగించారు. నిర్ణీత సమయంలోపు క్యూలో చేరినవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
రాత్రి 8 దాటినా పలుచోట్ల పోలింగ్ కొనసాగుతోంది. సా. 6 గంటల్లోగా క్యూలో వేచిఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో ఇంకా పోలింగ్ జరుగుతోంది. చీరాల, గాజువాకలో ఓటర్లు ఇంకా బారులు తీరారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలాచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కొన్నిచోట్ల రెండు, మూడు గంటల పాటు ఈవీఎంలు పనిచేయక ఓటింగ్ నిలిచిపోయింది.
ఈవీఎంలు పనిచేయకపోవడంతో పలుచోట్ల ఓటర్లు ఆందోళనకు దిగారు. గంటల తరబడి క్యూలో నిలుచోలేక అసహనం వ్యక్తం చేశారు. కొందరైతే వెనుదిరిగి వెళ్లిపోయారు. మళ్లీ సాయంత్రం అయ్యేసరికి ఓటు వేసేందుకు రావడంతో భారీగా క్యూ కట్టారు. సాయంత్రం 5 గంటల వరకు 65 శాతం పైగా పోలింగ్ నమోదైందని ప్రధాన ఎన్నికల కమిషనర్ గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లు సీఈవో వెల్లడించారు. ఘర్షణల్లో ఇద్దరు మృతిచెందారని, ఆరుచోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారని తెలిపారు. ఈ అన్నివిషయాలను కేంద్రఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళామన్నారు. రాజకీయపార్టీలు రీపోలింగ్ కూడా కోరుతున్నాయని, కేంద్ర ఎన్నికల పరిశీలకుల స్క్రూటీని తర్వాతే రీపోలింగ్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో మూడు గంటలకు పోలింగ్ ఆగిపోయిందని, రిపోలింగ్ నిర్వహించే విషయంపై పరిశీలిస్తున్నామన్నారు. క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లకు ఓటేసే అవకాశం కల్పించామని తెలిపారు. ఇక మొత్తం పోలింగ్ 80 శాతం పైగా అయ్యే అవకాశం ఉందన్నారు.
అనంతపురంలో పోలింగ్ హింసాత్మకంగా మారింది. జిల్లాలో పలు చోట్ల టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవల్లో టీడీపీ నేత తీవ్రంగా గాయపడ్డారు. తాడిపత్రి మండలం మీరాపురంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ నాయకుల దాడిలో టీడీపీ నేత శిద్దా భాస్కర్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. పోలింగ్ కేంద్రంలోనే ఈ దాడి జరిగింది. భాస్కర్‌రెడ్డిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మరోవైపు అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం అయినప్పటి నుంచీ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం సిద్ధ రామాపురంలో పోలింగ్ కేంద్రంలోనే టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. అదే మండలం అనప గ్రామంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన తనపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనమెట్లలో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని తెలిస్తే అక్కడికి వెళ్లినట్టు చెప్పారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లగానే తనపై దాడికి పాల్పడ్డారని, పోలింగ్ అధికారులు తలుపులు వేస్తే వాటినీ పగులగొట్టారని చెప్పారు. వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తారని ముందే ఊహించానన్నారు. ఈ విధంగా దాడులు చేయడం
ఇన్నేళ్లలో మొదటిసారి చూస్తున్నట్టు చెప్పారు. స్పీకర్‌గా ఉన్న తనకే ఇలా జరిగితే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఈవీఎంలు వద్దని సీఎం చంద్రబాబు ముందునుంచే చెబుతున్నారని ఈ సందర్భంగా కోడెల గుర్తు చేశారు.
విశాఖ జిల్లా గాజువాక శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. జనసేన అధ్యక్షుడు పపన్ కల్యాణ్ స్వయంగా బరిలో నిలిచిన ఈ స్థానంలో యువత హడావుడి బాగా కనిపించింది. మహిళలు, వృద్ధులను దగ్గరుండి మరీ పోలింగ్ కేంద్రాల వరకు తీసుకెళ్లారు. ఈ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన 307 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు 56 శాతం పోలింగ్ నమోదైంది. అధిక సంఖ్యలో ఓటర్లు క్యూలో నిలబడి ఉన్నారు. వీరందరికీ పోలింగ్ అధికారులు స్లిప్పులు అందజేశారు. చీకటి పడితే విద్యుత్ బల్బులు ఏర్పాటు చేసి మరీ పోలింగ్ ప్రక్రియ కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు.
అధికారులు ఉదయం 7గంటలకే ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ ఈవీఎంలు, వీవీప్యాట్‌లు మొరాయించడంతో దాదాపు 2 గంటలపాటు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఓటర్లు కాస్త నిరాశకు గురయ్యారు. కేంద్రీయ విద్యాలయం కేంద్రంలో 8 బూత్‌లు ఏర్పాటు చేయంగా అందులో 2 బూత్‌లు 10 గంటల వరకు పని చేయలేదు. మరో ఈవీఎంలో మాక్ పోలింగ్ డేటా డిలీట్ కాకపోవడంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. మరోవైపు ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో క్యూ లైన్లలో నిలబడలేక ఓటర్లు ఇంటి ముఖం పట్టారు. కానీ, మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలు కళకళలాడాయి. దీంతో పోలింగ్ శాతం కూడా పెరిగేందుకు అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఏపీలో 30 శాతం ఈవీఎంలు మొరాయించాయని, అక్కడ రీ పోలింగ్ నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అయితే, కేవలం 0.1 శాతమే ఈవీఎంలలో సమస్య వచ్చిందని వాటిని సరిచేశామని ఈసీ తెలిపింది. పార్టీల ముఖ్య నేతలు జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ లాంటివారు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయవాడలో పవన్ కళ్యాణ్ క్యూలో నిలబడకుండా ఓటు వేయడానికి వెళ్లడంపై నిరసన వ్యక్తమైంది.
దేశవ్యాప్తంగా కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 20 రాష్ట్రాల్లోని 91 లోక్ సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్ సభ స్థానాలకు 45,920 పోలింగ్ సెంటర్లలో పోలింగ్ నిర్వహించారు. 319మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి .175 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరిగింది. ఇటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు 34,603 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 443మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఏఐఎమ్ఐఎమ్, బీజేపీలు ప్రధాన పార్టీలుగా పోటీలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.