Political Movies: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నెలాఖరున లేదా వచ్చేనెల మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దీంతో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి.
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ అంశాలతో తెరకెక్కిన చిత్రాలు వరుసగా వస్తున్నాయి. వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందించిన ‘యాత్ర 2’ సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయింది.
మరోవైపు ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేస్తున్న పోరాటంపై మరో సినిమా తెరకెక్కుతోంది.
ఏపీ సీఎం జగన్ 3 రాజధానుల నిర్మాణం చేపడతామని ప్రకటించినప్పటి నుంచి రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారు. ‘రాజధాని ఫైల్స్’ పేరుతో రూపొందుతున్న ఈ మూవీ కూడా ఫిబ్రవరి 15వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
తాజాగా ఆర్‌జీవీ రూపొందించిన వ్యూహం సినిమాకు కూడా హైకోర్టులో లైన్ క్లియర్ అయింది. ఈ చిత్రం ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యూహం సినిమా జనవరిలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా నారా లోకేష్ అభ్యంతరం తెలియజేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ హైకోర్టు సింగిల్ జడ్జితో కూడిన ధర్మాసనం రద్దు చేసింది. ద్విసభ్య ధర్మాసనంలో వ్యూహం సినిమాకు గ్రీన్ సిగ్నల్ రావడంతో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ పొలిటికల్ సినిమాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయని చెప్పలేము. కానీ ఈ రాజకీయ చిత్రాలు మాత్రే ఏపీలో పొలిటికల్ హీట్‌ను పెంచబోతున్నాయి. ఈ చిత్రాలను ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారనేది చూడాలి. పొలిటికల్ మూవీస్‌లో ఏ పార్టీకి చెందిన ఎజెండా వారికుంది. ఎవరి యాంగిల్‌లో చూస్తే వారిదే కరెక్ట్ అనేలా ఈ సినిమాలను రూపొందించారు. మరోవైపు సినిమాలను చూసిన ప్రజలు ప్రభావితులు అవుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.