రాజధాని గ్రామాల పర్యటనకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం గేటు వద్దే ఆయన్ను అడ్డగించారు. పవన్‌తో పోలీసు అధికారులు చర్చలు జరుపుతున్నారు. పర్యటనకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పవన్ పర్యటన నేపథ్యంలో భారీగా కార్యకర్తలు, నేతలు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాజధాని విషయంలో 34 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకు వెళ్లడంపై పవన్ మండిపడ్డారు. సమావేశం అనంతరం రాజధాని గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందని పోలీసులు జనసేన పార్టీ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు.