‘అంటే.. సుందరానికీ..’ మూవీ.. ప్రస్తుతం థియేటర్లలో మంచి టాక్ తో నడుస్తోంది. నాని, నజ్రియా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నిన్ననే విడుదలైంది. చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. అయితే, ఆ చిత్ర నిర్మాణ సంస్థలపై హైదరాబాద్ పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఈ నెల 9న హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే, ఎక్కడా కరోనా నియమాలను పాటించలేదని మైత్రీ మూవీ మేకర్స్, కార్యక్రమ నిర్వహణ సంస్థ శ్రేయస్ మీడియాపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ రెండు సంస్థలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.