కరోనాపై సోషల్ మీడియా లో వస్తున్న నకిలీ వార్తలను అరికట్టేందుకు ఏపీ పోలీసులు వాట్సప్ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. 90716 66667 నెంబర్ ని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను ఈ నెంబర్ కు వాట్సాప్ చేస్తే ఆయా వర్గాలతో స్పష్టత తీసుకొని తిరిగి వాస్తవ సమాచారం అందించనున్నట్లు తెలిపారు. ఈ నెంబర్ లాంచింగ్ సమయంలో డీజీపీతో ఆన్‌లైన్ వీడియో కాల్‌లో సెలబ్రిటీలు పీవీ సింధు.. సినీనటులు అడవి శేషు, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
సోషల్ మీడియాలోని విస్తృతంగా ప్రచారాలు జరుగుతున్నాయని అందులో వాస్తవం ఎంత అనేది తేల్చి ప్రజలకు భరోసా కల్పిస్తామని డీజీపీ అన్నారు. ఈ సమయంలో సమాచారంలో నాణ్యత ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. చాలా మంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తారని వాస్తవాలకు దూరంగా సమాజంలో పరిస్థితులు ఉంటే అది మంచిది కాదని అన్నారు. సీఎం జగన్ మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్న ఆయన మహిళా బాధితులకు అండగా ఉంటామని అన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారు తప్పించుకోలేరని ఆలస్యమైనా శిక్ష తప్పకుండా పడుతుందని డీజీపీ హెచ్చరించారు. అవసరమైనంత సైబర్ నిపుణులు అందుబాటులో ఉన్నారని అన్నారు. అలాగే కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ వ్యాప్తి అనేది వాస్తవం కాదని అన్నారు. ఎంత వీలుంటే అంత ఇక డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తే బాగుంటుందని డీజీపీ అన్నారు.