ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు పనుల్లో సోమవారం రెండు ప్రపంచ రికార్డులు ఆవిష్కృతమయ్యాయి. గతంలో చేపట్టిన 21,580 క్యూబిక్ మీటర్ల పనులను 16 గంటల్లోనే నవయుగ సంస్థ అధిగమించింది. 24 గంటల్లో 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులతో గిన్నిస్ రికార్డుకెక్కింది. ప్రపంచ రికార్డు స్థాయిలో కాంక్రీట్‌ను నవయుగ సిబ్బంది డంప్ చేశారు. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈ రోజు ఉదయం 8గంటల వరకు నిరంతరాయంగా కాంక్రీట్ పోసి రికార్డు సృష్టించారు. దీంతో పోలవరం పనుల్లో రికార్డు నమోదైనట్టు గిన్నిస్ రికార్డు ప్రతినిధులు ప్రకటించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు వద్దే ప్రతినిధులు గిన్నిస్ రికార్డు ధ్రువపత్రాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… చరిత్ర సృష్టించామంటే కారణం సమిష్టి కృషేనని స్పష్టం చేశారు. ఎన్ని అవార్డులు వచ్చినా.. పోలవరానికి వచ్చిన రికార్డులే నా తృప్తినిస్తున్నాయనన్న ప్రకటించిన సీఎం… మార్చిలో 60 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేయాలి.. రికార్డును తిరగ రాయాలని సూచించారు. దేశం మొత్తం ఏపీని ఫాలో అవుతుందన్న సీఎం… కేంద్రం సహకరించకున్నా.. ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా పట్టుదలతో పనిచేశామన్నారు.