ఆంధ్రుల కలల ప్రాజెక్టు ‘పోలవరం’. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం కానుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీకి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తప్పనిసరిగా మారింది. అయితే కిందటి ప్రభుత్వంలో పోలవరం పనులు నత్తనడకన సాగగా.. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక పోలవరం పనులు జెట్ స్పీడుతో కొనసాగుతున్నాయి.
ఓవైపు ప్రాజెక్టు పనులు వేగవంతం జరుగుతుండగానే నేడు తొలి ఫలితం వచ్చింది. గోదావరి డెల్టాకు పోలవరం మీదుగా నీటిని విడుదలకు శుక్రవారం అంకురార్ఫణ జరిగింది. ఇందులో భాగంగా ఈసీఆర్ఎఫ్ నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నీటిని విడుదల చేశారు. గోదావరిలో నీటిని అప్రోచ్ కెనాల్ కు విడుదల చేయడం ద్వారా ఆ నీరు స్పిల్ వే.. రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు చేరుతుంది. అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతోపాటు తూర్పు.. పశ్చిమ కాల్వల ద్వారా గోదావరి డెల్టాను సశ్యశ్యామలం చేయనుంది.
గోదావరిలో ప్రవహించే నీరు బ్యారేజ్ నుంచి డెల్టాకు అందుతుంది. పోలవరం పూర్తయిన తర్వాత స్పిల్ వే.. రివర్ స్లూయిజ్.. పవర్ హౌస్ డిశ్చార్జ్ ల ద్వారా బ్యారేజ్ ల నుంచి కాల్వలకు చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండగానే నీరు గోదావరి డెల్టాకు చేరుతుండడం వల్ల పోలవరం తొలి ఫలితం అందుతున్నట్లయ్యింది. పోలవరం నిర్మాణంలో స్పిల్ వేతో పాటు మూడు గ్యాపులు (ఈసీఆర్ఎఫ్ 1,2,3) తో పాటు జల విద్యుత్ కేంద్రం.. జల రవాణా వంటి కీలక పనులను మేఘా ఇంజనీరింగ్ ఛాలెంజ్ గా తీసుకొని పూర్తి చేసింది.
పోలవరం ప్రాజెక్ట్ వద్ద గోదావరి నది సహజ ప్రవాహాన్ని అప్ప్రోచ్ ఛానల్ గుండా స్పిల్ వేకు మళ్లించిన సందర్భంగా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాన్ని జలవనరుల శాఖ, మేఘా ఇంజనీరింగ్ అధికారులు చేశారు. ఈ కార్యక్రమం లో జలవనరుల శాఖ ఈ ఎన్ సి నారాయణరెడ్డి, పోలవరం సి ఈ సుధాకర్ బాబు, ఎస్ ఈ నరసింహమూర్తి, ఈఈలు మల్లి ఖార్జునరావు, ఆదిరెడ్డి,బాలకృష్ణ,మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జి ఎం లుముద్దుకృష్ణ,దేవ్ మని మిశ్రా, సిజిఎం రవీంద్రరెడ్డి, ఎజిఎం రాజేశ్, డిజిఎం శ్యామలరావు,మేనేజర్ మురళి,లు పాల్గొన్నారు.
గోదావరి నది నీటిని 6.6 కిలోమీటర్ల మేరకు మళ్లించనున్నారు. సహజంగా ప్రవహించే గోదావరిని పోలవరం వద్ద కుడివైపునకు అంటే అప్రోచ్ ఛానెల్ నుంచి పైలెట్ ఛానెల్ వరకు మళ్లిండం సాధారమైన విషయం కాదు. ఇప్పుడు మొదలవుతున్న ఈ నీటి ప్రక్రియ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత కూడా అలాగే కొనసాగుతుంది. ఇందుకోసం నదీ మధ్య భాగంలో మూడు గ్యాపులు (1,2,3) నిర్మించాలి. అందులో గ్యాప్-2 గా పిలిచే ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం) అతిపెద్దది. 50లక్షల క్యూసెక్కుల నీటి ఒత్తిడిని తట్టుకునేలా దీనిని నిర్మిస్తారు. ఇటీవలే అప్పర్ కాఫర్ డ్యాం గ్యాపులను ప్రభుత్వ నిర్ణయానుసారం మేఘా ఇంజనీరింగ్ పూడ్చివేసింది.
నది ప్రవాహాన్ని మళ్లించేందుకు అవసరమైన పనులన్నింటిని మేఘా ఇంజనీరింగ్ రికార్డ్ సమయంలో పూర్తి చేసింది. గోదావరి ప్రవాహం కుడివైపునకు మళ్లీ స్పిల్ వేకు చేరాలంటే కనీస మట్టానికి తవ్వాలి. ఇప్పటికే అప్రోచ్ ఛానెల్ ను 2.4 కిలోమీటర్ల మేర తవ్వేశారు. దీంతో పెద్ద నది రూపుదిద్దుకుంది. ఇందుకోసం కోటి 54 లక్షల 88వేల మట్టి తవ్వకం పనులు చేయాల్సి ఉండగా ఇప్పటికే కోటి 4లక్షల 88వేల ఘనపు మీటర్లు పూర్తయింది. ప్రపంచంలో ఇంతవరకు అతిపెద్ద వరద డిశ్చార్జ్ స్పిల్ వే గా త్రిగాడ్జెస్ జలాశయం కంటే కూడా పోలవరం సామర్థ్యం మూడు లక్షల క్యుసెక్కులు అధికం. దీనిని తట్టుకునేలా ప్రపంచంలోనే అతిపెద్ద గేట్లను హైడ్రాలిక్ పద్ధతిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికే 76.29శాతం హెడ్ వర్క్స్ పనులు పూర్తయ్యాయి. వరద నీటిని అప్రోచ్ ఛానెల్ మీదుగా మళ్లిస్తున్నందున పోలవరంతోపాటు పలు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. నీటి ప్రవాహం స్పిల్ వేలో లక్ష క్యుసెక్కుల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. 12లక్షల క్యుసెక్కులకు చేరిన తరువాత ప్రభావం కనిపిస్తుంది. కనీస ప్రవాహం ఉన్నప్పుడు తొమ్మిది ఆవాసాల్లోకి నీరు ప్రవహిస్తుంది. 28మీటర్లు దాటిన తరువాత ముంపునకు గురయ్యే ఆవాసాల సంఖ్య పెరుగుతుంది. పూర్తి స్థాయిలో స్పిల్ వే వరకు (45.72 మీటర్లు) నీరు చేరేతే 235 ఆవాసాలు ముంపు భారీన పడతాయి. దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసి ముంపు గ్రామాల్లోకి ప్రజలను యుద్ధప్రతిపాదికన తరలిస్తుంది. మొత్తానికి పోలవరం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలై పరవళ్లు తొక్కనుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు