పవన్ కళ్యాణ్ 2014 లో కాకుండా, రాబోయే 2024 ఎన్నికల సందర్భంగా తన పార్టీ పెట్టి ఉండి ఉంటే.. కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఎక్కువ ఉండేది అని ఈ మధ్య జనసైనికులు తమ రాజకీయ గ్రూప్ ల్లో ఎక్కువగా మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు. మరి నిజంగానే 2024 ఎన్నికల సందర్భంగా పవన్ పార్టీ పెడితే ఎలా ఉండేది ? అనే విషయం కంటే ముందు.. ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా, రాజకీయంగా ఫెయిల్ అయిన మాట వాస్తవం. నిజమే ఆయనేమీ సీనియర్ ఎన్. టి.రామారావు గారు కాదు కదా!. పార్టీ పెట్టిన వెంటనే సీఎం అయిపోవడానికి. అలాగని, పవన్ కళ్యాణ్ ఏమీ ఆకర్షణ లేని హీరో కూడా కాదు కదా. తక్కువగా తీసి పడేయడానికి.
నేటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ కు వున్నారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకునే ఓటర్లు ఉన్నారు, పైగా అందులో యువతే ఎక్కువగా ఉంది. కానీ, పవన్ కళ్యాణ్ మొదటి నుంచీ ఆచి తూచే అడుగులు వేస్తున్నాడు. బహుశా తనకు సోలోగా గెలిచే అవకాశాలు దూరంగా వున్నాయని పవన్ కళ్యాణ్ భావించి ఉండొచ్చు. అందుకేనేమో జనసేన పార్టీ ప్రారంభం నుంచీ, ఎన్నికలు, పోటీ విషయంలో నెమ్మది తనాన్నే అనుసరిస్తునాడు. ఐతే, వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ పవన్ లో ఓ స్పష్టత లేదు అని జన సైనికుల్లో అనుమానాలు ఉన్నాయంటే.. దానికి బాధ్యత వహించాల్సింది పవన్ కళ్యాణే.
ఇక జన సైనికుల అభిప్రాయం ప్రకారం 2024 ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ తన పార్టీ పెట్టి వుంటే, కచ్చితంగా ఆశాభంగమే ఎదురయ్యేది. ఇప్పటికే ఎన్నికలో పోటీ చేయడం కారణంగా.. తను గెలవక పోయినా, తన అభ్యర్థి ఒకరు గెలిచారు. దీనివల్ల ఎన్నికలు, పోలింగ్ సరళి పై పవన్ కళ్యాణ్ కి అవగాహనకు వచ్చి ఉంటుంది. సోలోగా వెళ్తే.. తనకు, తన పార్టీకి కలిగే నష్టం ఎలా ఉంటుందో.. పవన్ కళ్యాణ్ కి ఓ స్పష్టత వచ్చి ఉంటుంది. అందుకే, 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కువగా పొత్తుల పైనే ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక పొత్తులు ఖరారు అయితే గానీ, పవన్ కళ్యాణ్ విజయావకాశాలు ఎలా ఉంటాయో అంచనా వేయలేం.
కారణాలు ఏవైనా కావొచ్చు, పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాల్లో నేర్చుకోవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కి ఉన్న మంచి అవకాశం.. టీడీపీతో కలిసి పోటీ చేయడం. సహజంగా రాజకీయాల్లో వాపు ను చూసి బలుపు అని భ్రమ పడతారు. గత ఎన్నికల్లో పవన్ ఆ భ్రమ తాలూకు ఫలితం ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. కాబట్టి, వచ్చే ఎన్నికల్లో అయినా, తన గెలుపుకు పునాది వేసుకుంటాడు అని ఆశిద్దాం. ఒకరకంగా 2024 ఎన్నికలు పవన్ కళ్యాణ్ కి ఒక అగ్ని పరీక్షే. ముఖ్యంగా పవన్ ఆలోచించుకోవాల్సింది, ఎన్నికల్లో విజయం సాధించాలి అంటే.. అభిమానం ఒకటే సరిపోదు. పాలక పక్షంపై ప్రజల్లో ఏవగింపు కూడా తోడు అవ్వాలి.
ప్రతిపక్షాల అదృష్టం కొద్దీ ఏపీలో ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయి. కానీ, పొత్తులు పోడవకుండా అడ్డుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి 50 సీట్లు అడగమని, అలాగే ఓ ఏడాది సీఎంగా అవకాశం కోరమని.. ఇలా పవన్ కి కొందరు సలహాలు పడేస్తున్నారు. పవన్ పొత్తుల పై విష ప్రయోగాలు చేస్తున్న వారంతా గుడ్డిగా నమ్మొచ్చు. పవన్ కి ఆవేశం తప్ప, రాజకీయ చతురత లేదు అని. పవన్ కళ్యాణ్ మరీ అంత అమాయకుడు ఏమీ కాదు. నాదెండ్ల మనోహర్ చెప్పు చేతల్లో పవన్ నడిచేట్టు కనబడుతున్నాడు అనుకోవడం.. అనుకున్న వాళ్ళ మూర్ఖత్వం. పవన్ కి తెలుసు తన పాత్ర ఏమిటి అనేది. గెలుపుకు సహకారం అందించే వారు ఎప్పుడూ రాజు కాలేరు. రాజు స్థానంలో ఉండి యుద్ధం చేసేవాడే రాజు అవుతాడు. మరి పవన్ కి దక్కేది ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రాజకీయంగా తన ఉనికిని కాపాడుకుంటే అదే అసలైన గెలుపు. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో నిజమైన గెలుపు దక్కొచ్చు.