‘తిరుమల వేంకటేశ్వరుడి సన్నిధిలో తలవంచి ఆశీస్సులు తీసుకుందామని వచ్చా.. దేవదేవుడి దర్శనానికి వెళ్తూ ప్రజా దేవుళ్లను సందర్శించే భాగ్యం లభించింది. తిరుపతిని అనేకసార్లు చూసే అదృష్టం నాకు లభించింది’ అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. తిరుపతిలోని రేణిగుంట సమీపంలోని కార్బన్ పరిశ్రమ పక్కన ఏర్పాటు చేసిన బీజేపీ ‘ప్రజా ధన్యవాద సభ’ లో మోడీ మాట్లాడారు. ‘నమో వేంకటేశాయ..’ అంటూ స్తోత్రంతో తెలుగులో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. శ్రీలంక నుంచి రావడం ఆలస్యమైనందుకు తనను క్షమించాలని కార్యకర్తలను మోడీ కోరారు.
‘బీజేపీ కార్యకర్తలు కర్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. మున్సిపల్ వార్డు గెలవలేని రోజుల్లోనూ భారత్‌మాతాకీ జై అన్నారు. బీజేపీ కార్యకర్తలు ఎన్నికలప్పుడే ప్రజలకు కనిపించేవాళ్లు కాదు. ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమై పనిచేస్తారు. అధికారంలోకి రావడమే కాదు.. ప్రజాసేవకు అంకితమవ్వాలి. జనంలో.. జనంతో ఉంటేనే ప్రజా హృదయాలు గెలుస్తాం. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కనబరిచిన ఏపీ, తమిళనాడు ప్రజలకు అభినందనలు. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తానని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా’ అన్నారు.
‘ఏపీ ఘన విజయం సాధించిన జగన్‌కు అభినందనలు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన..రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాల్సిందిగా కోరుతున్నా. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. కేంద్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి. ఏపీ అన్ని రంగాల్లో ముందుంది. ఏపీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏవిధంగానూ వెనుకడుగు వేయబోదు’ అని మోడీ స్పష్టం చేశారు.