మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ 94వ జయంతి సందర్భంగా రూ. 100 స్మారక నాణాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం విడుదల చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత, వాజ్‌పేయీ సన్నిహితుడు ఎల్‌కే అద్వాణీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ వాజ్‌పేయీ సేవలను గుర్తుచేసుకున్నారు. అటల్ జీ లేరు అని నమ్మడానికి తన మనసు అంగీకరించడం లేదని మోడీ భావోద్వేగానికి గురయ్యారు. అనారోగ్యం కారణంగా దాదాపు దశాబ్దం పాటు ఆయన ప్రజలకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ ఆయనను ఎవరూ మర్చిపోలేదని మోడీ అన్నారు. అటల్ జీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయనకు అశేష జనం తుది వీడ్కోలు పలికారని, ప్రజల మదిలో ఆయన స్థానమేంటో చెప్పేందుకు అదే నిదర్శనమని అన్నారు.
‘ప్రజాస్వామ్యం మహోన్నతంగా ఉండాలని అటల్ జీ ఎప్పుడూ కోరుకునేవారు. పార్టీ సిద్ధాంతాలపై ఆయన ఎప్పుడూ రాజీ పడలేదు. బీజేపీని అతిపెద్ద రాజకీయ పార్టీగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషిచేశారు. తన జీవితంలో చాలా ఏళ్లు ప్రతిపక్షంలో కొనసాగినప్పటికీ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడారు’ అని మోడీ కొనియాడారు.