హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలోని శ్రీరామనగరంలో సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిందని’ తెలుగు సినిమా విశ్వవ్యాప్తమైందని కొనియాడారు. తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తోందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. తెలుగు భాషా చరిత్ర ఎంతో సుసంపన్నమైందని కీర్తించారు.
కాగా రామానుజచార్యుల విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీక అని ప్రధాని మోడీ తెలిపారు. రామానుజ బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయన్నారు. ప్రగతి శీలత, ప్రాచీనతలో భేదం లేదని రామానుజాచార్యను చూస్తే తెలుస్తుందన్నారు. వెయ్యేళ్ల కిందట మూఢ విశ్వాసాలు ఎంతగా ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమేనని.. వాటిని తొలగించేందుకు రామానుజాచార్యులు ఎంతో కృషి చేశారని మోడీ గుర్తుచేశారు. ఆనాడే రామానుజాచార్యులు దళితులను కలుపుకుని ముందుకు సాగారన్నారు. ఆలయాల్లో దళితులకు దర్శన భాగ్యం కల్పించారన్నారు.
మన దేశంలో ద్వైతం, అద్వైతం కలిసి ఉన్నాయని, రామానుజాచార్యుల వారు ప్రవచించిన విశిష్టాద్వైతం మనందరికీ ప్రేరణ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. రామానుజాచార్యుల వారి బోధనల్లో వైరుధ్యం ఎప్పుడూ రాలేదని స్పష్టం చేశారు. చిన్నజీయర్ స్వామి తనతో విష్వక్సేనేష్ఠి యాగం చేయించారని మోడీ వెల్లడించారు. ఈ యజ్ఞ ఫలం 130 కోట్ల మంది ప్రజలకు అందాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇక్కడి శ్రీరామనగరంలో 108 దివ్యక్షేత్రాలను సందర్శించానని, దేశమంతా తిరిగి పుణ్యక్షేత్రాలను సందర్శించిన అనుభూతి కలిగిందని మోడీ అన్నారు.