కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా చేస్తున్న పోరులో భారతీయులందరినీ ఏకం చేసేందుకు వివిధ కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు ప్రధాని మోడీ. తాజాగా బీజేపీ కార్యకర్తలకు మరో టాస్క్ ఇచ్చారు. నేడు బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కొవిడ్‌పై పోరాడుతున్న వారికి సంఘీబావంగా కార్యకర్తలంతా ఒకపూట భోజనం మానెయ్యాలన్న పార్టీ సూచనను ప్రతిఒక్కరూ ఆచరించాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. పార్టీ జెండా ఆవిష్కరణలో సామాజిక దూరం పాటించాలని సూచించారు. పార్టీని ఈ స్థాయికి తీసుకురావడంలో అనేక మంది కార్యకర్తలు కృషి చేశారని.. వారి త్యాగ ఫలితంగానే నేడు ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని వ్యాఖ్యానించారు.
అంతకుముందు పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని మోడీపిలుపునిచ్చారు. ఆ సమయంలో సామాజిక దూరం పాటించాలని సూచించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయకు నివాళులర్పించాలని కోరారు. లాక్‌డౌన్‌తో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు వివిధ రూపాల్లో సంఘీభావం తెలపాలన్నారు. అందులో భాగంగా ఒకపూట భోజనం మానెయ్యాలని పిలుపునిచ్చారు. ‘ఫీడ్ ద నీడ్’ కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యకర్త ఆరుగురికి భోజనం అందించాలని కోరారు. పోలింగ్ కేంద్రం స్థాయిలో ప్రతిఒక్కరూ మరో ఇద్దరికి మాస్క్‌లు అందజేయాలని సూచించారు. ఈ కష్టకాలంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ధన్యవాద లేఖలు అందించాలన్నారు. స్థానికంగా ఉండే కరోనా యోధులకు కృతజ్ఞతా లేఖలు ఇవ్వాలన్నారు మోడీ.
ఇవీ చదవండి..