కరోనా మహమ్మారి కారణంగా దేశంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట రూ. 20 లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. దేశ జీడీపీలో 10 శాతమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కరోనాతో నాలుగు నెలలుగా పోరాడుతున్నారని, ఈ మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని తీవ్ర నష్టానికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంక్షోభ సమయంలో మరింత ధృఢ సంకల్పంతో పోరాడాలని పిలుపునిచ్చారు.
చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఊతమిస్తామని మోదీ అన్నారు. 21వ శతాబ్దపు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్యాకేజీని రూపొందించినట్లు తెలిపారు. నూతన ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల రూపకల్పనకు, మేకిన్ ఇండియా కల సాకారం చేసేందుకు ఈ ప్యాకేజీ దోహదపడుతుందన్నారు. కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ ముందుకు పోవాల్సి ఉంటుందని, కరోనాకు ముందు, కరోనా తర్వాత అని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితులనుంచి చాలా నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా నుంచి వచ్చిన సవాళ్లను మనం అధిగమించామని అన్నారు. ప్రపంచ దేశాలను ఆదుకోవడంలో భారత్
ముందుంటుందని మోదీ అన్నారు.