కరోనాపై యావత్ దేశ ప్రజలు పోరాడుతున్నారని, ఇక ముందు మరింత పోరాడవలసి వస్తుందని ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. భవిష్యత్తులో కరోనాతో మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కరోనా సమయంలో ఎంతోమంది నూతన ఆవిష్కరణలకు నాంది పలికారని అన్నారు. విద్యారంగంలోనూ ఎన్నో ఆవిష్కరణలు తెచ్చారని, విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసుల కోసం సరికొత్త పద్ధతులను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని వర్గాల ప్రజల కృషిచేస్తున్నారని కొనియాడారు.
దేశవ్యాప్తంగా కరోనా పోరులో మహిళలు తమ వంతు సహాయం అందించారని అన్నారు. మహిళా సంఘాలు మాస్కులు తయారు చేసి చేయూతనందించి మన దేశ సంస్కృతి, గొప్పతనాన్ని చాటారని తెలిపారు. కరోనా కాలంలో నిరు పేదలు, వలస కూలీల కష్టాలు వర్ణించలేమని అన్నారు. వారికోసమే శ్రామిక్ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. కరోనాను యోగా ద్వారా ఎదుర్కోవచ్చని తెలిపారు. కరోనా బారిన పడిన నిరుపేదలకు ఆయుష్మాన్ భారత్ వరంగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఆయుష్మాన్ భారత్ పథకంలో కోటి మంది చికిత్స పొందారని తెలిపారు. ఆంఫన్ తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయని, విపత్తు సమయంలో అక్కడి ప్రజలు చూపిన తెగువ, ధైర్యం ఎనలేనివని కొనియాడారు. ప్రస్తుతం దేశంలో మిడతల దండు దేశంలోని పంటపొలాలపై దాడిచేసి ఆహారాన్ని తినేయడం, ఆహార సంక్షోభానికి కారణమవుతుందనే భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మిడతలదండు ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.