దేశంలో లాక్‌డౌన్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ విధించిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా, ఈ వైరస్ వ్యాప్తి చెందటం గణనీయంగా తగ్గుతోందని చెప్తున్నారు. లాక్‌డౌన్ ఫలితాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయని అధికారులు అంటున్నారు. పూర్తి స్థాయిలో ఫలితాలు రావాలంటే ఇంకొంత కాలం తప్పనిసరిగా కఠినమైన నిబంధనలు అనుసరించాల్సి ఉంటుందని చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మన్‌కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూసిన తరువాత ఈ లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఈ మహమ్మరిపై విజయం సాధించాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని అన్నారు. లాక్ డౌన్ తో పేద ప్రజలకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు చెప్తున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు మోడీ తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారని, ఇది భారత్ కు జీవన్మరణ సమస్య అని ప్రధాని మోడీ తెలిపారు.