టాలీవుడ్ నటుడు శ్రీరామ్ చాలా రోజుల తరువాత నటిస్తున్న తాజా చిత్రం ‘పిండం’ ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. కుశీ రవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఆసక్తిని కలిగించేలా ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.
ఓ మారుమూల పల్లెటురిలో చాలా రోజులుగా ఎవరూ నివసించని ఒక ఇంట్లోకి హీరో శ్రీరామ్ తన కుటుంబంతో వస్తాడు. అయితే ఆ ఇంట్లో అడుగుపెట్టిన అనంతరం వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. ఇంట్లో ఉన్న ఆత్మ శ్రీరామ్ కుటుంబానికి నిద్ర లేకుండా, ప్రాణ భయంతో వణికిపోయేలా చేస్తుంది.
ఆ టైమ్‌లో వారికి సాయం చేయడానికి మంత్రగత్తె ఈశ్వరీ రావు వస్తుంది. అయితే ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ఆ ఆత్మల కథ ఏంటి? వాటి నుంచి శ్రీరామ్ కుటుంబాన్ని ఈశ్వరీ రావు రక్షించిందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా 1930 నుంచి 1990 వరకు మూడు టైమ్‌లైన్‌లలో ఈ సినిమా ఉండబోతున్నట్లు దర్శకుడు తెలిపాడు.
ఈ సినిమాను డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కళాహి మీడియా పతాకం పై యశ్వంత్ దగ్గుమాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రవివర్మ, మాణిక్ రెడ్డి, బేబీ చైత్ర, బేబీ ఈషా, విజయలక్ష్మి, శ్రీలత తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.