సూపర్‌స్టార్ రజనీకాంత్ తనదైన స్టైల్, మేనరిజంతో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. తమిళనాడులో అయితే అక్కడి వారికి తలైవా సినిమా ఒక పెద్ద పండగలాంటిదే. తెలుగులోనూ రజనీకి అభిమానులు తక్కువేం కాదు. అందుకే ఆయన నటించిన ప్రతి సినిమా ఏకకాలంలో తెలుగులోనూ విడుదలవుతుంది. ఈ సంక్రాంతికి కూడా తనదైన స్టైల్, మేనరిజమ్స్ అలరించేందుకు పేటగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు రజనీ. మరి గతేడాది 2.0తో అలరించిన ఆయన కొత్త ఏడాదిలో ఎలా మెప్పించారు? యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తన అభిమాన హీరోని తెరపై ఎలా ప్రెజెంట్ చేశాడు? విజయ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీల నటన ఎలా ఉంది?
కథ: కాళీ(రజనీకాంత్) ఒక కాలేజ్‌లో హాస్టల్ వార్డెన్‌గా చేరతాడు. అక్కడ చోటు చేసుకునే రకరకాల సమస్యలను తనదైన స్టైల్‌లో పరిష్కరిస్తాడు. ఒక ప్రేమ జంటను కూడా కలుపుతాడు. అనుకోని పరిస్థితుల్లో లోకల్ గూండాతో గొడవ పెట్టుకుంటాడు. అప్పుడే అతని పేరు కాళీ కాదు… పేట అని, అతడిది ఉత్తర్‌ప్రదేశ్ అని తెలుస్తుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సింహాచలం(నవాజుద్దీన్) అనే రాజకీయ పెద్ద నాయకుడితో విభేదాలు ఉంటాయి. అవి ఏంటి? అసలు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి పేట ఎందుకు వచ్చాడు? మళ్లీ అక్కడకు వెళ్లాడా? వెళ్లి ఏం చేశాడన్నది కథలోని అంశం.
విశ్లేషణ: రజనీకాంత్‌ను స్టైల్‌గా, ఎనర్జీగా చూడాలన్నది ఆయన అభిమానుల కల. ‘కబాలి’, ‘కాలా’, ‘2.ఓ’ చిత్రాలు రజనీలో ఉన్న మేనరిజాన్ని, స్టైల్‌ను దాచిపెట్టాయి. ఆయా కథలు కూడా అందుకు ఒప్పుకోలేదు. కానీ, చాలా కాలం తర్వాత రజనీ తన స్టైల్‌ను చూపించుకోవడానికి, తన ఛరిష్మా చూపించుకోవడానికి ఇలాంటి కథను ఎంచుకున్నాడనిపిస్తోంది. నవతరం ప్రతిభావంతులైన దర్శకుల్లో కార్తీక్ సుబ్బరాజు ఒకడు. తన కథల్లో చిన్న గమ్మత్తు ఉంటుంది. కాకపోతే అతను కూడా రజనీ స్టైల్‌ను ఫాలో అయిపోతూ, రజనీ సినిమాకు కావాల్సిన కమర్షియల్ హంగులతో కథను తయారు చేసుకున్నాడు. తొలి సన్నివేశాలు, రజనీ పరిచయ దృశ్యాలు, హాస్టల్‌లో జరిగే సంఘటనలు ఇవన్నీ కేవలం రజనీ అభిమానులను మెప్పించడానికే! ఈ సన్నివేశాలన్నీ, ఒక ‘నరసింహ’, ‘ముత్తు’, ‘అరుణాచలం’ చిత్రాల్లోని రజనీని తలపిస్తాయి. పోరాట సన్నివేశాలు కూడా అలాగే స్టైల్‌గా తీశాడు. సిమ్రన్‌తో జరిగే ట్రాక్ మొత్తం వింటేజ్ రజనీకాంత్‌ను మనకు చూపిస్తుంది. విరామ సన్నివేశాల వరకూ ఇసుమంత కథ కూడా దర్శకుడు చెప్పలేదు. కేవలం రజనీ అభిమానులను మెప్పించడానికే సన్నివేశాలను అల్లుకుంటూ వెళ్లాడు. ఆయన అభిమానులు కూడా అలాంటి సన్నివేశాలు చూడటానికే వస్తారు కాబట్టి, తొలి సగం గట్టెక్కేస్తుంది.
ద్వితీయార్ధంలో ఒక బలమైన కారణం ఉందని, అదే పేట.. కాళీగా మారడానికి కారణమై ఉంటుందని అభిమానులు నమ్ముతారు. కానీ, ద్వితీయార్ధం కూడా ఫక్తు కమర్షియల్ సన్నివేశాలతో నడిపించాడు. మొత్తంగా చూస్తే ఇదో రివేంజ్ డ్రామా. తొలి సగంలో రజనీ మేనరిజమ్స్, స్టైల్‌పై ఆధారపడిన దర్శకుడు, సెకండాఫ్ మొత్తాన్ని ఫ్లాష్‌బ్యాక్, తను తీర్చుకునే పగతోనూ పూర్తి చేశాడు. బలమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంటే ఇలాంటి కథలు అదిరిపోతాయి. కానీ, అదే ఈ సినిమాకు కాస్త లోపంగా మారింది. కార్తీక్ సుబ్బరాజు ఈ కథను ఎందుకు రజనీ దగ్గరకు తీసుకెళ్లాడు? రజనీ ఎందుకు ఒకే చెప్పారో అర్థం కాదు కానీ, ఇది అందరికీ తెలిసిన కథే. ఫ్లాష్‌బ్యాక్ రక్తికట్టి ఉంటే, ఈ సినిమా మరో రేంజ్‌లో ఉండేది. ఇటీవల కాలంలో రజనీని రజనీలా చూడలేకపోయామని నిరాశ పడుతున్న అభిమానులకు మాత్రం ఇది ఫుల్‌మీల్స్. పాటలు కథ గమనానికి స్పీడ్ బ్రేకర్స్‌లా ఉన్నాయేమో అనిపిస్తుంది. అందులో కూడా రజనీ స్టైల్‌ను చూసి మురిసిపోవడం తప్ప ఆ పాటల వల్ల సినిమాకు వచ్చిన అదనపు బలం ఏమీ ఉండదు.
నటీనటులు: రజనీకాంత్‌కు ఇలాంటి పాత్రలు చేయడం వెన్నతో పెట్టిన విద్య. తనలోని నటుడిని సవాల్ చేసే సన్నివేశం ఈ చిత్రంలో ఒక్కటి కూడా కనిపించదు. చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. కుర్రాడిలా రజనీకాంత్ ఇచ్చే హావభావాలు కాస్త ఎంటర్‌టైన్ చేస్తాయి. ఈ వయసులోనూ అంత జోరుగా నటించడం కేవలం రజనీ వల్ల మాత్రమే అవుతుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయసేతుపతిలాంటి నటులకు ఈ కథలో చోటిచ్చాడు దర్శకుడు. కానీ, వాళ్ల స్థాయికి తగ్గట్టు ఆ పాత్రలను తీర్చిదిద్దలేదేమోననిపిస్తుంది. వారిద్దరూ ఇటీవల కాలంలో చేసిన అత్యంత బలహీనమైన పాత్రలు ఇవి. సిమ్రన్, త్రిషలతో రజనీకాంత్ నడిపిన లవ్ ట్రాక్ సినిమాకు కాస్త ఉపశమనం. అయితే, వారివి ప్రాధాన్యం ఉన్న పాత్రలేమీ కాదు. తనదైన నేపథ్య సంగీతంతో అనిరుధ్ హోరెత్తించాడు. రజనీని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూడటానికి అనిరుధ్ ఇచ్చిన బీజీఎమ్స్ చక్కగా సరిపోయాయి. తిరు సినిమాట్రోగఫ్రీ చాలా బాగుంది. సాంకేతికంగా రజనీ సినిమాల స్థాయిలోనే పేట కూడా ఉంది. కొన్ని సంభాషణలు గమ్మత్తుగా అనిపిస్తాయి.
టైటిల్ : పేట
నటీనటులు : రజనీకాంత్, త్రిష, సిమ్రన్, విజయ్ సేతుపతి, నవాజుద్ధీన్ సిద్ధిఖీ
సంగీతం : అనిరుధ్
దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్
నిర్మాత : అశోక్ వల్లభనేని, కళానిథి మారన్
హైలైట్స్
రజనీకాంత్
సిమ్రన్-రజనీల ట్రాక్
డ్రాబ్యాక్స్
సెకండ్ హాఫ్
చివరిగా : రజనీని అభిమానులకు మాత్రం ఈ చిత్రం ‘ఫుల్‌మీల్స్’లాంటిది
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)