HomeTelugu Big Storiesగోదావరి జిల్లాలను వణికించిన పెథాయ్‌

గోదావరి జిల్లాలను వణికించిన పెథాయ్‌

1a 1

నాలుగు రోజులనుంచి ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన పెథాయ్‌ తుపాను తీరం దాటుతూ విలయాన్ని సృష్టించింది. క్రమంగా బలహీన పడుతూ యానాం- కాకినాడ మధ్య తీరాన్ని దాటింది. తుపాను ప్రభావంతో ఏకధాటిగా కురిసిన వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. లక్షల ఎకరాల పంటలను ముంచెత్తాయి. గాలులతో కూడిన వర్ష బీభత్సం మత్స్యకారులకు కునుకులేకుండా చేసింది. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాయి. రహదారులు దెబ్బతిని ప్రజారవాణాపై తీవ్ర ప్రభావం కనిపించింది. గంటకు 80 కి.మీ.నుంచి 100 కి.మీ.వేగంతో వీచిన గాలులు విద్యుత్తు స్తంభాలను నేలకూల్చాయి. అధికార యంత్రాంగం ముందే సన్నద్ధం కావడం కొంతవరకు నష్ట తీవ్రతను తగ్గించింది. యుద్ధప్రాతిపదికన చేపట్టిన సహాయ చర్యలు బాధితులకు ఊరటనిచ్చాయి. సోమవారం రాజస్థాన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడినుంచి కూడా సహాయ చర్యలపై సమీక్షించారు.

పెథాయ్ తుపాను తీరం దాటే సమయంలో బలహీనపడినా.. భీకర గాలులు, భారీవర్షాలతో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గంటకు 80 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు విద్యుత్తు స్తంభాలు, కొబ్బరి చెట్లను నేలకూల్చాయి. సుమారు 700 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మెట్ట, మాగాణి పంటలు నీట మునిగాయి. సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడగా.. అక్కడక్కడా సముద్రం 10 నుంచి 50 అడుగులు ముందుకొచ్చింది. ఎగువప్రాంతాల్లో కురిసిన వర్షంతో ప్రకాశం బ్యారేజీకి వరదనీరు పోటెత్తింది. అధికార యంత్రాంగం ముందే సన్నద్ధం కావడంతో కొంత వరకు నష్ట తీవ్రత తగ్గింది. మరోవైపు..రాష్ట్రవ్యాప్తంగా చలిగాలులకు 23 మంది మృతిచెందారు. జిల్లాల నుంచి అందుతున్న ప్రాథమిక అంచనాల ప్రకారం 3.87 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలకు విజయవాడ క్రీస్తురాజపురంలో కొండరాళ్లు మీదపడి ఒకరు చనిపోయారు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో గోడ కూలి ఒకరు మరణించారు.

1d

కాకినాడలోని దుమ్ములపేటకు చెందిన జాలర్ల బోటు నాలుగు రోజుల కిందట సముద్రంలో వేటకు వెళ్లి సాంకేతిక లోపంతో చిక్కుకుంది. తుపాను తీవ్రత కాకినాడ నగరంపై ఎక్కువగా ఉంటుందనే సమాచారంతో పడవలో ఉన్న ఆరుగురు మత్స్యకారుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమైంది. వీరిని రక్షించాలంటూ మత్స్యకారులు జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. మరోవైపు విశాఖ జిల్లాకు చెందిన అయిదుగురు మత్స్యకారులు కాకినాడ నుంచి వేటకు వెళ్లి గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. తీరానికి 30 మైళ్ల దూరంలో ఉన్నామని, త్వరలోనే చేరుకుంటామని ఆదివారం వీరు బంధువులకు ఫోన్‌ చేశారు. ఆ తరువాత నుంచి ఎలాంటి సమాచారం లేదు. * ఉప్పలంక, కోరంగి, జగన్నాథపురం వంతెన, పరదేశిపేట, గోళీలపేట ప్రాంతాలకు చెందిన ఏడుగురు మత్స్యకారులతో సముద్రంలో చిక్కుకున్న మరో పడవ అల్లవరం మండలంలోని కొమరగిరిపట్నం ప్రాంతంలోని సీతారాంపురం రేవుకు చేరుకోవడంతో వారిని పునరావాస కేంద్రానికి తరలించారు.

విజయనగరం జిల్లాలో చేపల కంచేరులో లంగరేసిన అయిదు పడవలు గల్లంతయ్యాయి. అక్కడే మరో 14 పడవలు దెబ్బతిన్నాయి. ముక్కావులో ఒక పడవ, తిప్పలవలసలో నాలుగు పడవలు దెబ్బతిన్నాయి. మొత్తం రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లింది. పెథాయ్‌ తీరం దాటే సమయంలో కోనాడ, ముక్కాం, తిప్పలవలస, చింతపల్లి తీరప్రాంత మండలాల్లో ఇసుక తుపాను రేగింది.

1e

పెథాయ్‌ తుపాను తూర్పుగోదావరి జిల్లాను వణికించింది. కాకినాడ నగరంతోపాటు తాళ్లరేవు, కాట్రేనికోన, అమలాపురం, ఉప్పలగుప్తం, ఉప్పాడ కొత్తపల్లి, ఐ.పోలవరం, అల్లవరం, సఖినేటిపల్లి, మామిడికుదురు, తొండంగి తదితర తీర ప్రాంత మండలాల్లో ఈ ప్రభావం కనిపించింది. జిల్లాలోని 50 ప్రాంతాల్లో చెట్లు కూలి రహదారులపై రాకపోకలు స్తంభించాయి. ప్రత్యేక బృందాలు.. జేసీబీలు, క్రేన్లతో వీటిని తొలగించి రాకపోకలు పునరుద్ధరించాయి. రాజోలు మండలంలోని చింతపల్లి గ్రామంలో యూపీ పాఠశాలపై కొబ్బరిచెట్టు పడింది. శివకోటి గ్రామంలో ప్రహరీపై చెట్టు కూలింది. భారీ వర్షానికి ముమ్మిడివరంలోని అభయాంజనేయస్వామి ఆలయంలో ధ్వజస్తంభం విరిగింది. నాలుగు పెంకుటిళ్లు దెబ్బతిన్నాయి. ఈ నెల 19 నుంచి వరద ప్రభావం కనిపిస్తుందన్న అంచనాతో శ్రీకాకుళంలో తీర ప్రాంతంలోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నదుల్లో వరద తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు భావించి తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. పెథాయ్‌ సిక్కోలు వైపు మళ్లుతుందన్న అంచనాతో ముందస్తుగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మంగళవారం కూడా పాఠశాలలు తెరవొద్దని అధికారులు ఆదేశించారు.

1 18

పశ్చిమగోదావరి జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో 19 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 2,636 మందికి పునరావాసం కల్పించారు. వీరవాసరం, ఉండి, భీమవరం మండలాల్లో 45 విద్యుత్తు స్తంభాలు కూలిపోగా సిబ్బంది వెంటనే పునరుద్ధరించారు. తల్లాడ- దేవరపల్లి జాతీయ రహదారిపై చెట్లు కూలిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
* విశాఖపట్నం జిల్లాలోని తీరప్రాంత 11 మండలాల్లో 101 గ్రామాల్లో పెథాయ్‌ ప్రభావం కనిపించింది. 2.32 లక్షల మంది తుపాను ప్రభావానికి గురయ్యారు. నక్కపల్లి, పాయకరావుపేట, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లోని 49 గ్రామాలు అల్లకల్లోలమయ్యాయి. విశాఖ నగరాన్ని ఆనుకుని ఉన్న పరవాడ, పెదగంట్యాడ, భీమునిపట్నం, గాజువాక, విశాఖ రూరల్‌, అర్బన్‌ మండలాల పరిధిలో ఉన్న మరో 52 గ్రామాలపై ప్రభావం చూపింది. జిల్లా కేంద్రానికి అందిన సమాచారం ప్రకారం ఇంతవరకు 90 చోట్ల సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. 26,323 మందిని తరలించారు. వీరికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన ఏర్పాట్లు చేశారు.

1c

ఈపీడీసీఎల్‌ పరిధిలో 700 గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. గాలుల తీవ్రతకు కొన్నిచోట్ల విద్యుత్తు సరఫరాను ముందే నిలిపేయగా. మరికొన్నిచోట్ల చెట్లు విరిగి తీగలపై పడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో 99 గ్రామాల్లో అంధకారం నెలకొంది. కాకినాడ నగరంలో ఆదివారం అర్థరాత్రి దాటాక 3.30 గంటల నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. వర్షాలు, గాలుల కారణంగా 12 మండలాల పరిధిలో 17 విద్యుత్తు ఉప కేంద్రాల దగ్గర ఫీడర్లు దెబ్బతిన్నాయి. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు కుంగి కూలిపోయాయి. మూడు జిల్లాలకు కీలకమైన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చెట్లు, స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. 250 విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. 20 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. రెండు కిలోమీటర్ల మేర విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. తూర్పుగోదావరిలో 98 గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచింది. అధిక వేగంతో వీచిన గాలులకు మొత్తం 297 మొబైల్‌ టవర్లు దెబ్బతిన్నాయి. ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో 127, విశాఖపట్నంలో 80, మిగిలినవి ఇతర జిల్లాల్లో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించి సముద్ర తీర ప్రాంతంలోని 18 టవర్ల విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. జనరేటర్లను పంపి సేవలను పునరుద్ధరించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ గదిలో రెండు గంటల పాటు అంతర్జాలానికి విఘాతం కలగడంతో సేవలు స్తంభించాయి.

1b

తుపాను ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి పెరిగింది. కట్టలేరు, మున్నేరు తదితర వాగులు, వంకల నుంచి భారీగా నీరు వస్తుండడంతో సోమవారం సాయంత్రం బ్యారేజీ మూడు గేట్లను అడుగు మేర ఎత్తి 2,175 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండడంతో, ఈ జిల్లాలకు వెళ్లే ప్రధాన కాల్వలకు నీటి విడుదల నిలిపివేశారు. దీంతో బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 అడుగులు దాటే పరిస్థితి ఉండడంతో గేట్లు ఎత్తారు.

పెథాయ్‌ తుపానుతో తెలంగాణలో అనూహ్య వాతావరణ మార్పులు ఏర్పడ్డాయి. సోమవారం తీవ్రమైన చలి గాలులు, భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య పెద్దగా వ్యత్యాసం లేకుండాపోయింది. ఖమ్మం, భద్రాద్రి, మహబూబూబాద్‌, జయశంకర్‌ భూపాల్‌పల్లి, వరంగల్‌ గ్రామీణ తదితర జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఈ జిల్లాల్లో ఎక్కువ శాతం మిరప తోటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి, అరటి చేలకూ నష్టం వాటిల్లింది. హన్మకొండలో సోమవారం పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రత 18.9 డిగ్రీలుంది. ఇది సాధారణం కన్నా 11 డిగ్రీలు తక్కువ కావడం గమనార్హం. పెథాయ్‌ తుపాన్‌ ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో గత 3 రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. చిరు జల్లులకు గాలి తోడు కావడంతో చలి తీవ్రత మరింత పెరిగింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu