HomeTelugu Big Storiesహీరో నాని ఏ కిరాణా కొట్టు లెక్కలు చెప్పారో నాకు తెలియదు: పేర్ని నాని

హీరో నాని ఏ కిరాణా కొట్టు లెక్కలు చెప్పారో నాకు తెలియదు: పేర్ని నాని

perni nani pressmeet on cin

సినిమా టికెట్ల అంశంపై కమిటీని ప్రభుత్వం నియమించిందని థియేటర్ల వర్గీకరణ, ధరలను ఆ కమిటీ నిర్ధారిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆ కమిటీ ధరలను నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిస్తుందన్నారు. మంగళవారం అమరావతి సచివాలయంలో మంత్రి పేర్ని నాని సినిమా డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్య పరిష్కారం కోసమే కమిటీ వేశామని.. వాళ్లు ఇచ్చే నివేదికను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో కొన్ని థియేటర్లు ఎలాంటి అనుమతి లేకుండా నడుపుతున్నారని.. అలాంటి వాటిపైనే చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.

‘ఈ రోజు డిస్ట్రిబ్యూటర్లు, వారి అసోసియేషన్లతో సమావేశం నిర్వహించాం. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సినిమా టికెట్‌ ధరలు పెంచాలని ప్రధానంగా వారు కోరారు. సినీ పరిశ్రమ వర్గాల నుంచి కూడా కొన్ని విజ్ఞాపనలు వచ్చాయి. అవన్నీ పరిశీలనలో ఉన్నాయి. రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. సామాన్యుడికి అందుబాటులో ఉండేలా వినోదాన్ని ఎలా అందించాలన్నది ఆ కమిటీ పరిశీలించి, నిర్ణయం తీసుకుంటుంది. ఇదే విషయాన్ని డిస్ట్రిబ్యూటర్లకు కూడా చెప్పాం. కమిటీల పేరుతో కాలయాపన చేయాలన్న ఉద్దేశం లేదు. వీలైనంత త్వరగా అందరికీ మేలు చేసేలా నిర్ణయం ఉంటుంది.’

‘థియేటర్‌ యజమానులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది పలువురు ఆరోపణలు చేస్తున్నారు. వారు తెలిసి మాట్లాడుతున్నారా? లేక తెలియక మాట్లాడతున్నారో అర్థం కావటం లేదు. ఈ ఏడాది సెప్టెంబరులో డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబ్యూటర్స్‌ అందరితోనూ సమావేశమయ్యాం. రాష్ట్రంలో కొన్ని థియేటర్లు ఎలాంటి అనుమతి లేకుండా నడుపుతున్నారు. సినిమా ప్రదర్శనకు రెవెన్యూ శాఖ నుంచి బీఫాం, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌వోసీ తప్పనిసరిగా ఉండాలని సూచించాం. అయినా కూడా ఇప్పటివరకూ థియేటర్ల యజమాన్యాలు రెన్యువల్‌ చేయించుకోలేదు. కనీసం లైసెన్స్‌కు కూడా దరఖాస్తు చేసుకోని వారిపై మాత్రమే చర్యలు తీసుకున్నాం. ఇప్పటివరకూ నిబంధనలు అతిక్రమించిన 130 థియేటర్‌లపై చర్యలు తీసుకున్నాం. జీవో నెం.35 ఏప్రిల్‌ 2021లో వచ్చింది. దానికి నిరసనగా ఇప్పుడు థియేటర్లు మూసివేయడం ఏంటో వారి విజ్ఞతకే వదిలేస్తున్నా’

perni nani 1

‘హీరో నాని ఎక్కడ ఉంటారో తెలియదు. ఏ సినిమా హాలు పక్కన, ఏ కిరాణా కొట్టు ఉందో తెలియదు. ఆయన ఏ హాలుకు ఏ కిరాణా కొట్టు లెక్కలు చెప్పారో కూడా నాకు తెలియదు. బహుశా ఆయన స్టేట్‌మెంట్‌ ఇచ్చారంటే బాధ్యతాయుతంగా ఇచ్చి ఉంటారని అనుకుంటున్నా. సినిమా హాళ్ల కౌంటరు, పక్కనే ఉన్న పచారీకొట్టు కౌంటరు లెక్కపెట్టి చెప్పి ఉండవచ్చు. ఇక చెన్నైలో ఉండే నటుడు సిద్ధార్థ్ గారు తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసి ఉంటారు. మద్రాసులో ఉండే ఆయనకు ఏపీ టికెట్లతో సంబంధం ఏంటి? ఆయనేమైనా పన్నులు ఇక్కడ చెల్లిస్తున్నారా? మేము విలాసంగా బతుకుతున్నట్లు మమ్మల్ని ఎప్పుడైనా చూశారా’ అని మంత్రి పేర్ని నాని కౌంటర్‌ ఇచ్చారు.

perni nani 2

‘నిర్మాత దిల్‌రాజు వచ్చి మమ్మల్ని కలిసే విషయమై మాకు ఎలాంటి సమాచారం లేదు. ఎవరూ ఫోన్‌ కూడా చేయలేదు. సెప్టెంబరులో సమావేశానికి వచ్చిన సందర్భంగా ఆయన పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆయనే నాలుగైదు సార్లు ఫోన్‌ చేశారు. హడావుడి తగ్గిన తర్వాత కలుద్దామని చెప్పా. ఇప్పటివరకూ నాతో ఎవరూ మాట్లాడలేదు. ఎవరు వచ్చినా మాట్లాడటానికి జగన్‌మోహన్‌రెడ్డిగారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సినీ పరిశ్రమలోని అనేక వర్గాల వారు వచ్చి విజ్ఞాపనలు ఇచ్చారు. ఇక్కడ అందరూ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష ఉండదు. సినిమా టికెట్‌ రేట్లకూ కక్ష సాధింపు చర్యలకు ఏమైనా సంబంధం ఉందా? ఏదేదో ఆపాదించుకుని, విమర్శలు చేయడం ధర్మం కాదు. ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌ చేయడమనేది నిరంతర ప్రక్రియ. తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుని తనిఖీలు చేస్తారు. కొన్నిసార్లు ఆకస్మిక తనిఖీలు కూడా చేయొచ్చు. చిరంజీవిగారు మమ్మల్ని కలిసే విషయమై మాకు ఎలాంటి సమాచారం లేదు. బహుశా సీఎంగారి పేషీకి ఏమైనా చేశారమో తెలియదు.’ అని మంత్రి పేర్ని నాని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu