సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతలు నేడు మచిలీపట్నంలో సమావేశమైయ్యారు. టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపాలని పలువురు సినీ ప్రముఖులు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సినీ ప్రముఖులు దిల్ రాజు, డి.వి.వి.దానయ్య, బన్నీ వాసు, సునీల్ నారంగ్ తదితరులు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏపీ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్నినానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పేర్నినాని మాట్లాడుతూ..‘ఆన్‌లైన్ టికెంటింగ్ విధానంపై సినీ పరిశ్రమ సానుకూలంగా ఉంది. చిరంజీవి నాతో మాట్లాడారు. ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరుపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యలతో చిత్ర పరిశ్రమకి సంబంధం లేదని చెప్పారు’ అని పేర్ని నాని తెలిపారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దు. సినిమా టికెట్ల రేట్లు పెంచమని మేమే కోరాం. దాని గురించి గత సమావేశంలో చర్చించాం. మంత్రి నాని సానుకూలంగా స్పందించారు. దాన్ని పూర్తి స్థాయిలో సినీ పరిశ్రమకి వివరించలేకపోయాం. అందుకే ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అనుకోని పరిణామాలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. కరోనా కాలంలో సినీ పరిశ్రమ ఎంతగా నష్టపోయిందో మంత్రికి విరించామన్నారు. పరిశ్రమపై కోవిడ్ ప్రభావం, థియేటర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి గతంలోనే తీసుకెళ్లామన్నారు. ‘గతంతో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు రాజమౌళితో కలిసి సీఎంను కలిశాం. మా విజ్ఙప్తిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సినిమా అనేది చాలా సున్నితమని, ఏ సమస్య వచ్చిన ఆ ప్రభావం నిర్మాతలపైనే పడుతుందన్నారు. అందుకే చిత్ర పరిశ్రమ సమస్యలను రాజకీయం చేయొద్దని మీడియాను కోరారు. టికెట్టు ఆన్‌లైన్ విధానం కావాలని పరిశ్రమ తరపున మేమే ప్రభుత్వాన్ని కోరాం. ఆన్‌లైన్ విధానం ద్వారా ట్రాన్స్పరెన్నీ(పారదర్శకత) ఉంటుంది’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
అలాగే నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. రాజకీయం వేరు.. సినిమా పరిశ్రమ వేరన్నారు. ఎవరో ఏదో మాట్లాడితే.. తమకు సంబంధం లేదన్నారు. థియేటర్లో 100 శాతం ఆక్యూపెన్సీ పెరగాలనేదే తమ ఉద్దేశమని, టికెట్లను ఆన్‌లైన్ చేయమని అడిగింది తామేనని ఆయన స్పష్టం చేశారు.