కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. దానితో అన్నీ రంగాలు మూతపడిపోయాయి. దాని ప్రభావంతో సినిమా రంగం కూడ పూర్తిగా మూతపడింది. షూటింగులు అన్నీ బ్రేక్‌లు పడ్డాయి. గత 60 రోజులుగా సినిమా థియేటర్లు బంద్ అయ్యాయి. దీంతో ఈ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్న లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. నాలుగో దశ లాక్‌డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో దాదాపుగా అన్ని కార్యాలయాలు తెరుచుకున్నాయి. ప్రైవేట్ ఆఫీస్ లు కూడా పనిచేయడం మొదలుపెట్టాయి. సినిమా రంగానికి మాత్రం ఎలాంటి మినహాయింపులు ఇవ్వకపోవడంతో ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సినిమా పెద్దలు సమావేశం అయ్యారు.
ఈ సమావేశానికి సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు. సినిమా షూటింగ్ లు, సమస్యలు, సినిమా థియేటర్లకు అనుమతులు వంటి వాటిపై చర్చించారు. ఇండస్ట్రీలోని సమస్యల గురించి ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, వాటికి అనుమతి ఇస్తున్నట్టుగా తలసాని చెప్పడంతో సినిమా ఇండస్ట్రీకి కొంత ఊరట లభించింది. నిర్మాణం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎదురు చూస్తున్న సినిమాలు ఇక చకచకా ఈ పనులు జరుపుకోబోతున్నాయి.