ఆర్ ఎక్స్100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం రేపిన పాయల్ రాజ్ పుత్ తన రెండో సినిమా RDX లవ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాయల్ రాజ్ పుత్ బోల్డ్ గా కనిపిస్తూనే కంటెంట్ పరంగా కూడా నటించి మెప్పించేటట్టుగా ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ :
పాయల్ రాజ్ పుత్ తన తోటి అమ్మాయిలతో కలిసి గ్రామాల్లో ప్రభుత్వ పధకాల గురించి ప్రచారం చేస్తుంటుంది. ఎయిడ్స్, గుట్కా, మద్యపానం, ధూమపానం వంటి వాటిపై ప్రచారం చేస్తూ.. వాటి నివారణ కోసం పాటు పడుతుంటుంది. ఈ క్రమంలోనే ఆమెను అనేక సమస్యలు చుట్టుముడతాయి. అయినప్పటికీ పాయల్ వెనకడుగు వేయదు. ఏం జరిగినా సరే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటుంది. ముందుగా మహిళలతో కలిసి చేస్తున్న పోరాటం గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటుంది. ఎలాగైనా ముఖ్యమంత్రిని కలిసి.. తన సొంత గ్రామం చంద్రన్నపేటలో జరుగుతున్న విషయాలను వివరించి అక్కడ మార్పు తీసుకురావాలని అనుకుంటుంది. ఇదే సమయంలో హీరో తేజస్ ఆమెకు పరిచయం అవుతాడు.. ప్రేమించానని వెంటబడతాడు. అతనితో కలిసి అడుగువేసే సమయంలో ఇబ్బందుల్లో పడుతుంది. ఆ ఇబ్బందులు ఏంటి? ఎవరు ఇబ్బందులు కలిగించారు.? తేజస్ అసలు ఎవరు ? గ్రామం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి?అన్నది మిగతా కథ…
విశ్లేషణ:
ప్రతి గ్రామంలో ఒక్కో సమస్య ఉంటుంది. పరిష్కారం కాకూండా మిగిలిపోయిన సమస్యలు అనేకం ఉన్నాయి. కొన్ని సమస్యలను కావాలని పరిష్కరించకుండా పక్కన పెడతారు. కారణం, ఆ సమస్యలు పరిష్కరిస్తే.. తరువాత గ్రామానికి అక్కడి నాయకుల అవసరం ఉండదు. ఓ గ్రామానికి చెందిన అమ్మాయి..ధైర్యం చేసి బయటకు వచ్చి ఎయిడ్స్ పై పోరాటం చేసేందుకు ముందుకు వస్తుంది. దానిపై అవగాహన కల్పించేందుకు రెడీ అవుతుంది. ప్రతి ఇంటికి వెళ్లి ఆ సమస్య గురించి చెప్తూ.. దానికి సొల్యూషన్ చూపిస్తూ ఉంటుంది పాయల్ రాజ్ పుత్. ఇంటింటికి వెళ్లి ఏవో వస్తువుల గురించి చెప్పినట్టుగా కండోమ్స్ గురించి చెప్పడం వాటిని వారికి ఇవ్వడం అన్నది కొంచం నమ్మేట్టుగా లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఇలానే సాగిపోతుంది. అసలు కథ ఏంటి అన్నది చెప్పే ప్రయత్నం చేయలేదు. ముఖ్యమంత్రికి సమస్యని వివరించడానికి కథానాయిక ఇన్ని పాట్లు పడాలా? నేరుగా తన సమస్యని భుజాన వేసుకొని పోరాటం చేయలేదా అనే ప్రశ్నలు సినిమా చూస్తున్నంతసేపూ రాకమానవు. ఆరంభ సన్నివేశాలతోనే దాదాపుగా కథ చెప్పేశాడు దర్శకుడు. డ్రామా, ఎమోషన్స్‌పై దృష్టిపెట్టాల్సిన దర్శకుడు ఆ దిశగా చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేదు. కథానాయకుడు ఎవరు? అతని తండ్రి రంగంలోకి ఎందుకు దిగాల్సొచ్చిందనే విషయాలు తప్ప ద్వితీయార్ధంలో కూడా ఆసక్తిని రేకెత్తించే అంశాలేమీ లేవు. పైగా సెకండ్ హాఫ్ లో వస్తాదులతో పాయల్ రాజ్ పుత్ అండ్ కో కబడ్డీ ఆడటం వంటివి చూపించారు. ఒక సమస్యను చూపించాలనే కోణంలో కాకుండా.. పాయల్ ను రొమాంటిక్ గా చూపించే కోణంలోనే సినిమా ఉండటం విశేషం. సినిమా టైటిల్ ఉద్దేశ్యం కూడా ఇదే అనిపిస్తుంది.
నటీనటులు:
సినిమాలో ప్రధాన పాత్ర పాయల్ రాజ్ పుత్ చేసింది. సినిమా మొత్తం ఆమెనే కనిపించింది. ఒకవైపు సామజిక కార్యకర్తగా ఆకట్టుకుంటూనే.. మరోవైపు గ్లామర్ గా కనిపించి మెప్పించింది. ఆర్‌ఎక్స్ 100 సినిమాలో పాయల్ ను చూపించిన విధంగానే ఇందులోనూ రొమాంటిక్ గా చూపించారు. ఇక హీరో పాత్ర కేవలం హీరోయిన్ చుట్టూ తిరగడంతోనే సరిపోతుంది. మిగతా నటీనటుల పాత్రలు కూడా అంతంత మాత్రంగా ఉంటాయి.
హైలైట్స్:
పాయల్ రాజ్ పుత్ అందాలు
సినిమాటోగ్రఫీ
డ్రాబ్యాక్స్:
కథ, కథనాలు, సాగతీత
టైటిల్ : RDX లవ్
నటీనటులు: పాయల్ రాజ్ పుత్, తేజస్, ఆదిత్య మీనన్, నాగినీడు, ముమైత్ ఖాన్ తదితరులు
దర్శకత్వం : శంకర్ భాను
నిర్మాత : సి కళ్యాణ్
సంగీతం : రథన్
చివరిగా : తుస్సుమన్న ఆర్డీఎక్స్
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)