బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్యతో పాయల్ రాజ్‌పూత్ స్పందించింది. బాలీవుడ్ ప్రముఖులు తనతో స్నేహంగా ఉండరంటూ ఆయన మాట్లాడిన పాత ఇంటర్వ్యూను చూసిన ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్పందించారు. ‘నా మైండ్‌లో ఎన్నో ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. వాటిని మీతో ఎలా పంచుకోవాలో అర్థం కావడం లేదు.. ఏదేమైనప్పటికీ ‘ఆత్మహత్య చేసుకోవడం పరిష్కారం కాదు’. చిత్ర పరిశ్రమలో చీకటి కోణం కూడా ఉంది. మొదటిది.. నెపోటిజం.. ఇది బాలీవుడ్ నరనరాల్లో ఇంకిపోయింది, రెండు.. ఈ ఆటకు అదృష్టం అనే పేరు పెడతారు, మూడు.. అభద్రతాభావం కల్పిస్తారు’.
‘అక్కడి వారు నన్ను కూడా దూరం పెట్టారు. ‘పాయల్ నువ్వు దీనికి సరిపోవు’ అంటూ నా స్థానంలో మరొకర్ని తీసుకున్నప్పుడు.. నా గుండె పగిలింది. కుంగిపోయా.. అంతేకానీ ఆత్మహత్య చేసుకోవాలి అనుకోలేదు. మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. మీ మనసులోని మాటలు, కష్టాలు, బలహీనతలు, సమస్యలు ఇతరులతో పంచుకోవడం కొన్నిసార్లు కష్టమే. కానీ ఓ విషయం చెప్పండి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇతరుల సాయం తీసుకోవడం లేదా? తీసుకుంటున్నాం. జీవితం ఎంతో అమూల్యమైంది.. దాన్ని మధ్యలోనే సులభంగా వదిలేయకండి’.
‘జీవితంలో ఎత్తుపల్లాలు వస్తుంటాయి. అయినా ఫర్వాలేదు. బాధల్లో ఉన్నప్పుడు కొందరు ముఖంపై చిరునవ్వు వేసుకుని, అంతా బాగుందని అబద్ధాలు చెబుతూ జీవిస్తుంటారు ఎందుకు?. మీ పరిస్థితి బాలేదని చెప్పండి. గట్టిగా ఏడ్వండి, కేకలు పెట్టండి. మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో సమయం గడపండి. మనకంతా మంచి, చెడు రోజులు ఉంటాయి. ప్రపంచంలోని ఏ వ్యక్తి ప్రతిరోజూ సంతోషంతో ఉండలేడు. ఒకవేళ ఉంటే అతడు మనిషి కాదు’ పాయల్ పేర్కొన్నారు. అంతేకాదు తన ఇన్‌స్టా ప్రొఫైల్‌గా సుశాంత్ ఫొటో పెట్టుకున్నారు. బాలీవుడ్‌లో బంధుప్రీతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కంగనా రనౌత్‌కు ధన్యవాదాలు తెలిపారు.