కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఎఫెక్ట్ దేశంలో కూడా బాగానే ఉంది. దానితో భారత్ అప్రమత్తమై లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకూ పొడిగించారు. దీంతో కోట్లాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రోజు కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. వారే కాదు, చిత్ర పరిశ్రమలోని కార్మికులు, చిన్న నటులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. తన పరిస్థితీ అలాగే ఉందని అంటోంది హీరోయిన్ పాయల్ ఘోష్. తెలుగులో ‘ప్రయాణం’ సినిమాలో నటించింది ఈ అమ్మడు. ఆ తర్వాత ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’తో పాటు ఒకట్రెండ్ సినిమాల్లో నటించింది.
కాగా, తాజా లాక్‌డౌన్‌పై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదననను వ్యక్తం చేసింది. ”పని లేదు. జీవితం, ప్రయాణాలు లేవు. ఆర్థికంగా చితికి పోతున్నాం. ఇలాంటి జీవితాన్ని ఎప్పుడూ ఊహించుకోలేదు. ప్రస్తుతం మనందరి జీవితాలు పూల పాన్పులు కాదు. పరిస్థితులు అనుకూలించనప్పుడు సర్దుకుపోవాల్సిందే. లాక్‌డౌన్ నియమ, నిబంధనలు పాటించాలి. మనం జాగ్రత్తగా ఉండటంతో పాటు, మనతోటి వారు భద్రంగా ఉండేలా చూసుకునే బాధ్యత కూడా మనదే” అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరూ బయటకు రావొద్దని చెబుతూ, ‘మనం వైరస్‌ను వ్యాప్తి చేస్తే, మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బాధ్యతాయుతంగా ఉండండి. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. కలిసి పోరాడండి. ఆరోగ్యంగా ఉండండి” అని పాయల్ ఘోష్ తెలిపింది.