నటి పాయల్ ఘోష్ కొద్దిరోజుల క్రితం సినిమాలో అవకాశాల కోసం వెళ్తే ఓ బాలీవుడ్ డైరెక్టర్ తనను వేధించాడని, గదిలోకి తీసుకెళ్లి బ్లూ ఫిలిం చూపించాడని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ డైరెక్టర్ పేరు మాత్రం చెప్పలేదు. దీంతో ఆ డైరెక్టర్ ఎవరా? అని అందరూ ఆలోచనలో పడ్డారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ స్టార్ డైరెక్టర్ పేరు అనురాగ్ కశ్యప్ అంటూ బాంబు పేల్చింది పాయల్. స్త్రీ స్వేచ్ఛ గురించి ఉపన్యాసాలు దంచే అతడే తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది.
‘బాంబే వెల్‌వెట్’ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సమయంలో సినిమా ఛాన్స్ కోసం ‘అనురాగ్ కశ్యప్‌ను కలిశాను. కలిసిన మరుసటి రోజే ఫోన్ చేస్తే ఆయన వద్దకు వెళ్లాను. ఆ సమయంలో అతను మద్యం తాగుతున్నాడు. కాసేపు నాతో మాట్లాడిన తర్వాత మరో గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ సోఫాలో కూర్చున్న తర్వాత.. ‘రణబీర్ కపూర్ సినిమాలో నటించాలనుకునే అమ్మాయిలు నాతో పడుకోవడానికి వెనుకాడరు’ అని చెప్పాడు. నేనెంత గొప్ప వ్యక్తినో అర్థం చేసుకోవాలని అన్నాడు. తనతో సన్నిహితంగా మెలిగితే భవిష్యత్తులో నాకు మేలు జరుగుతుందని అన్నాడు. నాతో మాట్లాడే సమయంలో అక్కడే నన్ను బలవంతం చేయబోయాడు.
సినిమా ఇండస్ట్రీలో శారీరక సంబంధాలు పెట్టుకోవడం కామన్, చాలామంది హీరోయిన్లు నేను ఫోన్ చేస్తే రావడానికి రెడీ ఉంటారు. నేను చెప్పినట్లు వింటే నీకూ అవకాశాలు వస్తాయి’ అని అనురాగ్ నాతో చెప్పాడు. ఆ సమయంలో ఏం చేయాలో నాకు తోచలేదు. ఆ సమయంలో తాను శారీరకంగా, మానసికంగా సిద్ధం లేనని, మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పి తప్పించుకున్నాను. ఈ విషయాన్ని బయటపెడదామనుకుంటే చాలామంది అడ్డుకున్నారు. ఆయనతో పెట్టుకుంటే నాకు భవిష్యత్ ఉండదని చెప్పడంతో సైలెంట్ అయిపోయాను అని తెలిపింది. ఓ అమ్మాయి అవకాశాల కోసం డైరెక్టర్‌ని కలిసినంత మాత్రాన వేశ్యలా భావించడం సరికాదంటూ పాయల్ తన ఆవేదన వెళ్లబుచ్చింది.