పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఏలూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రశంగించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రెండో రోజు కూడా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై విమర్శల దాడి కొనసాగించారు. నేను ఓ సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కుమారుడిలా జనసేన పార్టీని స్థాపించానని పవన్ చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుండటమే తనకు కావాలన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు కూడా తన కోసం ఏమీ అడగలేదని, రౌడీలను నియంత్రించమని చంద్రబాబును కోరితే.. అదుపుచేయడంలేదని విమర్శించారు. ఒక ఎమ్మెల్యే ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే చింతమనేని ఆగడాలు ఏలూరు వరకు విస్తరించాయన్నారు. ఎమ్మెల్యేలకు పేకాట క్లబ్బులపై ఉన్న ఆసక్తి ప్రజా సమస్యలపై లేదని దుయ్యబట్టారు. పోలీసులపైనా దాడులు చేస్తున్న చింతమనేనిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని, విప్ పదవి నుంచి తొలగించాలని పవన్ డిమాండ్ చేశారు.