నెల్లూరులో ప్రత్యేకంగా జరిగే రొట్టెల పండుగ ఈ రోజు ప్రారంభమవనుంది. నేటి నుంచి అయిదు రోజుల పాటు ఈ పండగ జరుగుతుంది. నెల్లూరులోని స్వర్ణాల చెరువులో ప్రతి సంవత్సరం ఈ పండుగను నిర్వహిస్తారు. రొట్టెల పండుగ సందర్భంగా బారాషాహీద్ దర్గాను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. దర్గా దగ్గరలోని స్వర్ణాల చెరువులో స్నానం చేసి రొట్టె తీసుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ పండగకు ఏపీ ప్రజలతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఈ నేపథ్యంలో దర్గా దగ్గర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. కాగా ఈ నెల 23న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఈ నెల 25 నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పవన్ పర్యటన మొదలవుతుంది. శుక్రవారం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పర్యటన కార్యక్రమాలపై రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్), జిల్లా సమన్వయకర్తలు, సంయుక్త, సమన్వయకర్తలతో పవణ్ కల్యాణ్ చర్చించి ప్రణాళిక ఖరారు చేశారు.
జనసేన పోరాటయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తారు. ఈ పర్యటన 25 వ తేదీన ఏలూరులో మొదలవుతుంది. ఈ పర్యటనలో భాగంగా పోలవరం ప్రోజెక్ట్‌ను సందర్శించి, అక్కడి పనులను పరిశీలిస్తారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై పవన్ చర్చిస్తారు. నిర్వాసితులకు పునరావాసం, పరిహారం అందించిన తీరు, వాళ్ళ బాధలపై నేరుగా వారితోనే పవన్ మాట్లాడతారు. ముంపు మండలాల్లోని గ్రామాలకు వెళ్తారు అక్కడి సమస్యలను నేరుగా పరిశీలిస్తారు, అన్ని నియోజకవర్గాల్లోని సమస్యలపై సంబంధిత వర్గాలతో పవన్ చర్చిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన అనంతరం పవన్ తూర్పు గోదావరి జల్లాలోకి పవన్ అడుగుపెడతారు.