జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. గురువారం (14న) రాజమహేంద్రవరంలో పార్టీ ఆవిర్భావ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సభకు యుద్ధ శంఖారావం అని పేరు పెట్టారు. రాజమహేంద్రవరం సభ అనంతరం ప్రచారం ఉద్ధృతం చేసే యోచనలో పవన్ ఉన్నారు. ఈ విషయంపై పార్టీ నాయకులకూ స్పష్టత ఇచ్చి, ప్రచార ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. రోజుకు 3 చోట్ల ఎన్నికల సభలకు ఏర్పాట్లు చేయాలని పవన్ పేర్కొన్నారని సమాచారం. హెలికాప్టర్ సాయంతో రాష్ట్రమంతటా చుట్టి రావాలనే యోచనలో ఆయన ఉన్నారు. దీంతోపాటు రోడ్డు షోలలోనూ ఆయన పాల్గొంటారు. మరోవైపు కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులను కొలిక్కి తీసుకురావడం, పార్టీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయడం వంటి వాటిపై పార్టీ నాయకులు దృష్టి సారించారు. వామపక్షాలు కోరిన స్థానాలను యథాతథంగా కేటాయించేందుకు పార్టీ సానుకూలంగా లేదని సమాచారం. జనసేనకు బలం ఉన్న స్థానాలనే వామపక్షాలు ప్రతిపాదిస్తుండటంతో ఈ విషయంపై పార్టీ అధినేత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంగళవారం పవన్ కల్యాణ్‌తో వామపక్ష పార్టీల చర్చలు సాగుతాయని భావించినా అనుకోకుండా రద్దయ్యాయి. 16న సమావేశమవుదామని జనసేన కార్యాలయం నుంచి వామపక్ష నాయకులకు వర్తమానం అందింది.
పార్టీ మేనిఫెస్టోపై నిపుణుల కమిటీ కసరత్తు సాగిస్తోంది. విశ్రాంత ఉన్నతాధికారి నేతృత్వంలో మరో ఇద్దరు నిపుణులు కలిసి మేనిఫెస్టోకు తుదిరూపు ఇచ్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే జనసేన మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను ప్రకటించింది. రాజమహేంద్రవరం సభలో పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటనకు కసరత్తు చేస్తున్నారు.
శాసనసభ, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయని పవన్ కల్యాణ్ సోమవారమే ట్వీట్ చేశారు. ఆ పేర్లు బుధవారం వెల్లడించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజమహేంద్రవరం, అమలాపురం లోక్‌సభ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. ముమ్మిడివరం అసెంబ్లీ సీటుకు పితాని బాలకృష్ణ పేరును పార్టీ తొలి అభ్యర్థిగా గతంలోనే వెల్లడించారు. గుంటూరు సభలో నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్‌ల పేర్లూ వెల్లడించారు.