జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ విభాగాలకు సంబంధించి కమిటీలను నియమించారు. ఈ కమిటీల వివరాలను రేపు విజయవాడలో ప్రకటించబోతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాలవారీగా సమీక్షలు నిర్వహించిన అనంతరం క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన సమాచారాన్ని అధ్యయనం చేసి, విశ్లేషించి ఈ కమిటీలకు ఆయన రూపమిచ్చారని పార్టీ వర్గాలు చెప్పాయి. అలాగే.. వాడవాడలా జనసేన పార్టీని బలోపేతం చేసేలా, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు కార్యక్రమాలను రూపొందించినట్టు తెలిసింది. రేపు ప్రకటించబోయే కమిటీలలో పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పి.ఎ.సి.), లోకల్ బాడీ ఎలక్షన్స్ కమిటీ, క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) మానిటరింగ్ కమిటీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి మానిటరింగ్ వంటి ముఖ్యమైన కమిటీలు ఉన్నట్లు తెలుస్తోంది.