జనసేన అధినేత పవన్‌కల్యాణ్ .. గాజువాకలో రాజకీయ కార్యకలాపాలు కొనసాగించడానికి, తన నివాసం కోసం ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న పవన్.. గత వారం నామినేషన్ వేసిన రోజున రోడ్‌షో నిర్వహించి వెనుదిరిగారు. స్థానికంగా కార్యాలయాన్ని కూడా ప్రారంభించలేదు. ఇవే అంశాలతో పవన్‌ను టార్గెట్ చేస్తూ టీడీపీ, వైసీపీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గాజువాకపై పవన్ ఫుల్ ఫోకస్ పెట్టారు. గాజువాక వై జంక్షన్ సమీపంలోని కర్ణవానిపాలెంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇకపై ప్రజలకు ఇక్కడే అందుబాటులో ఉంటారు. ఎన్నికల అనంతరం కూడా ఆ ఇంటి నుంచే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించనున్నారు.
పవన్‌కల్యాణ్ ప్రచారానికి వీలుగా విజయవాడ నుంచి ప్రచార రథాలను కూడా రప్పించారు. గాజువాకలో ప్రచారం కోసం 35 మంది సభ్యులతో ఒక కేంద్ర ప్రచార కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి వార్డు నుంచి కనీసం ఇద్దరు చొప్పున ఆ కమిటీలో ఉంటారు. ప్రతివార్డులో ప్రచారం చేయడానికి వీలుగా వార్డుకు 10 నుంచి 20 ప్రచార కమిటీలు వేశారు. ఒక్కో ప్రచార కమిటీలో 10 మంది సభ్యులుంటారు.