Homeతెలుగు News'చంద్రన్నకు సెలవిద్దాం.. జగనన్నను పక్కనపెడదాం': పవన్‌

‘చంద్రన్నకు సెలవిద్దాం.. జగనన్నను పక్కనపెడదాం’: పవన్‌

2 25వైసీపీ, టీడీపీ నేతలు కలిసికట్టుగా అవినీతి సొమ్మును పంచుకుంటున్నారని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆరోపించారు. మట్టి, ఇసుక దోపిడీకి హద్దూ అదుపు లేకుండా పోయిందన్నారు. ఆఖరికి శ్మశానాలు కబ్జా చేయడానికి కూడా వెనుకాడటం లేదన్నారు. ‘టీడీపీ నేతలు చేస్తున్న అవినీతికి ఈడీ నుంచి సమన్లు వస్తున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలోనూ రూ.వెయ్యి కోట్ల అవినీతి జరుగుతోంది’ అన్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘చంద్రబాబుకు వయసైపోయింది. జగన్‌కు సమర్థత లేదు. వాళ్లను పక్కనబెట్టి జనసేనకు పట్టం కట్టండి’ అని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ‘చంద్రన్నకు సెలవిద్దాం.. జగనన్నను పక్కనపెడదాం’ అని నినదించారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం బలమైనదని.. రాజ్యాంగం నుంచి ప్రతిపక్ష నేత జగన్‌ తప్పించుకోలేరని చెప్పారు.

‘చాలామంది అవినీతిపరులు జనసేనలో చేరుతున్నారు. వాళ్లను ఎందుకు చేర్చుకుంటున్నారని ఓ కార్యకర్త నన్ను ప్రశ్నించాడు.. అవినీతి నేతలు మన పార్టీలోకి వచ్చి నీతిగా మారతారని నేను అతనికి చెప్పా’నని పవన్‌ వివరించారు. రేపు అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలుగానీ, నేనుగానీ తప్పుచేస్తే చొక్కా పట్టుకుని ప్రశ్నించే హక్కు మీకు ఉందని ప్రజలను ఉద్దేశించి పవన్‌ అన్నారు.

సీపీఎస్‌ విధానం గురించి పవన్‌ మాట్లాడుతూ ఒక్కసారి శాసనసభలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే జీవితాంతం పింఛను తీసుకుంటారు.. అదే ప్రజల కోసం కష్టపడి దాదాపు 30 ఏళ్ల పాటు పనిచేసిన ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే విద్య, వైద్యం కోసం అధిక బడ్జెట్‌ను కేటాయిస్తామన్నారు. తన పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే స్థాయిలో వాటిని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. నారాయణ, చైతన్య విద్యా సంస్థలపై తీవ్ర విమర్శలు చేసిన పవన్‌ ఆ సంస్థలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాయని ఆరోపించారు.

నా మతం.. ధర్మం. నా కులం.. రెల్లికులం అని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. రెల్లి కులస్థులు రోడ్లను శుభ్రం చేస్తారని ఈ జాతికి పట్టిన అవినీతి, అధర్మాన్ని తుడిచేయడానికి రెల్లికులం స్వీకరించానని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే అర్చకుల ఆత్మగౌరవాన్ని కాపాడతానని జనసేన అధినేత అన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఉదయం బ్రాహ్మణ సంఘాలతో ఆయన భేటీ అయ్యారు. బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏటా రూ.1500 కోట్లు కేటాయించాలని పలువురు కోరగా.. దానికి పవన్‌ స్పందిస్తూ రూ.2,500 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. సమావేశంలో నేతలు నాదెండ్ల మనోహర్‌, ముత్తా గోపాలకృష్ణ, కందుల దుర్గేష్‌, ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu