ఆంధ్ర రాజకీయాల్లో ఈ మధ్య తరుచూ పవన్ కల్యాణ్ గురించి ఓ ప్రశ్న వినబడుతుంది. పవన్ సీఎం కావాలి అని. సరే వచ్చే ఎన్నికల్లో ఆ అవకాశం ఉండదు. బాబు ఉండగా పవన్ కళ్యాణ్ ను ప్రజలు సీఎం గా అంగీకరించరు. మరి, పదేళ్ల తర్వాత అయినా ఆంధ్రప్రదేశ్ కు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా ?. ఉండొచ్చు, అలాగే లేకపోవచ్చు కూడా. రాజకీయాల్లో నిరంతరం పోరాటం చేస్తూ ఉండాలి. అన్నిటికీ మించి అదృష్టం కూడా కలిసి రావాలి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి.. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది కాలానికే ముఖ్యమంత్రి అయ్యే రోజులు పోయాయి. ఒకసారి చరిత్రలోకి వెళ్దాం.
పవన్.. మొరార్జీ దేశాయ్ ను ఆదర్శంగా తీసుకో !
మాజీ సీఎం రాజశేఖరరెడ్డి 25 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న తర్వాతే ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా 15 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి, పైగా ఎన్నో కీలక పదవుల్లో ఉన్న తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ కూడా 30 సంవత్సరాల పైన రాజకీయ జీవితం గడిపితే గానీ, ముఖ్యమంత్రి అవ్వలేదు. ఇక జగన్ రెడ్డి కూడా పదేళ్లు నిత్యం ప్రజల్లో తిరిగితే గానీ ముఖ్యమంత్రి కాలేదు. ఐతే, ఎంజీఆర్, సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన కొద్దికాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారు. వీరిద్దరూ ప్రత్యేకమైన కోవ లోకి వస్తారు.
అదేమిటి, పవన్ కళ్యాణ్ కూడా ఎంజీఆర్, సీనియర్ ఎన్టీఆర్ లా స్టార్ డమ్ ఉన్నవాడే కదా అని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయ పడొచ్చు. కానీ, ఎంజీఆర్, సీనియర్ ఎన్టీఆర్ లను అప్పటి ప్రజలు దేవుళ్లుగా చూసేవారు. కాబట్టి, వారు వేరు, పవన్ కళ్యాణ్ వేరు. మరి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడా ?. రాజకీయాలనే అంటి పెట్టుకొని ఉంటే ఎప్పుడో ఒకప్పుడు పవన్ ప్రత్యర్థులు నిర్వీర్యం అవుతారు. అప్పుడు కచ్చితంగా ప్రజలలో పవన్ కళ్యాణ్ పై సానుభూతి కలుగుతుంది. అప్పుడు కచ్చితంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు.
కానీ ఆ రోజులు కోసం పవన్ కళ్యాణ్ ఓపికగా వేచి ఉండాలి. ఓపిక ఉన్నప్పుడే ఎవరైనా ఏదైనా అవుతారు. ఇందుకు నిదర్శనంగా నిలిచారు మొరార్జీ దేశాయ్. నిజానికి నెహ్రూ చనిపోయిన వెంటనే మొరార్జీ దేశాయ్ ప్రధాని కావాలి. కానీ, అలా కాలేదు. లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన తర్వాత కూడా మొరార్జీ దేశాయ్ కాలేదు. చివరకు 1977లో మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యారు. ప్రధాని అయ్యే అవకాశాలు వచ్చిన పదేళ్ల తర్వాతే మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యారు. పవన్ కూడా మొరార్జీ దేశాయ్ లా వేచి ఉంటేనే ఆశ నెరవేరుతుంది. లేదంటే.. నిరాశే.