జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం ఢిల్లీ వెళ్లారు. బీజేపీ నాయకులతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితుల గురించి, రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయంపైనా, ఆర్థిక పరిస్థితి గురించి కేంద్రానికి వివరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఏపీ శాశ్వత రాజధాని అమరావతేనని పవన్ కల్యామ్ స్పష్టం చేశారు. రాజధానిని తరలించడం అంత సులభం కాదని పవన్ అన్నారు. రిపబ్లిక్ డే వేడుకలను మొదట విశాఖలో జరపాలనుకున్న ప్రభుత్వం వెనక్కి తగ్గి తిరిగి విజయవాడ లోనే నిర్వాహించాలనుకుందని గుర్తు చేశారు. అమరావతి విషయంలో కూడా ప్రభుత్వ ధోరణి అదే అని అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా వాటి పనితీరు మాత్రం మారడం లేదని పవన్ కల్యాణ్ ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు వస్తున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం వాటిని సరిగ్గా వినియోగించడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే రాజధానిని మారుస్తున్నట్టు వైసీపీ చెప్తోందని, మూడు రాజధానుల విషయంలో కేంద్రానికి అస్సలు సంబంధం లేదని పవన్ తెలిపారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో పలు కీలక విషయాలపై చర్చించామని.. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం తన పద్దతిని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అమరావతిలో మహిళలు, రైతులను తీవ్రంగా హింసించారని, కేంద్ర మంత్రుల వద్ద ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తానన్నారు. బీజేపీతో కలిసి కూలంకషంగా చర్చించి బలమైన కార్యచరణ ప్రకటిస్తానని పవన్ తెలిపారు.