జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, పార్టీ విజయావకాశాలపై సమీక్షలు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. తొలి విడత సమీక్షలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన అభ్యర్థులతో పవన్ సమావేశమయ్యారు. పోలింగ్ ముగిసిన దాదాపు 10రోజుల తర్వాత పార్టీ తరఫున మొదటి సమావేశం ఇదే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ముఖ్యంగా పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలు, ఈవీఎంల పనితీరుపై నాయకుల అభిప్రాయలు తీసుకుంటున్నారు. అలాగే కొన్ని చోట్ల పార్టీ అభ్యర్థులు సరిగా ప్రచారం నిర్వహించలేదనే సమచారం పార్టీకి ఉంది. అభ్యర్థులతో సమీక్ష సందర్భంగా ఈ విషయాన్ని పవన్ ప్రస్తావించి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమకు వందకుపైగా సీట్లు వస్తాయని ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో జనసేన కచ్చితంగా ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందనే విషయంపైనా పవన్ కల్యాణ్ ఓ అంచనాకు రానున్నారు.