జనసేన పోరాట యాత్రలో భాగంగా చిత్తూరు రోడ్ షోలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ బీజేపీపై ఘాటైన విమర్శలు చేశారు. దేశభక్తి మీకే ఉందా..? మిగతా ఎవరికీ లేదా? అని ప్రశ్నించారు. “బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి నా దేశభక్తి గురించి విమర్శించారు. పవన్ ఎక్కడ తగ్గాలో కూడా నేర్చుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. ఎక్కడ తగ్గాలో తెలియకుండా రాలేదు.. చిత్తూరు నుండి చెప్తున్నా. ఎక్కడ పెరగాలో కూడా నాకు తెలుసు. తనను తాను తగ్గించుకున్న వాడే హెచ్చింపబడును అని చిన్నప్పుడు టీచర్ బైబిల్ పాఠాలు బోధించారు. నా దేశ భక్తి ఏంటో తెలియాలంటే వెళ్లి ప్రధానమంత్రిని అడగండి. ఆయనే చెబుతారంటూ ఘాటుగా బదులిచ్చారు పవన్ కల్యాణ్.
రాయలసీమలో తనకు బలం లేదని కొంతమంది నేతలు వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావిస్తూ.. తన బలం ఏమిటో చూపిస్తానన్నారు. తాను పార్టీ పెట్టేటప్పుడు ఎంతో మంది భయపెట్టారని.. కాని జన బలమే తన బలం అని నమ్మి వచ్చానని అన్నారు. ఏడు కొండల వాడి సాక్షిగా, పీర్ బాబా సాక్షిగా చెబుతున్నా.. జనసేన అధికారంలోకి వస్తే ఏ ముఖ్యమంత్రీ అభివృద్ధి చేయని విధంగా రాయలసీమను అభివృద్ధి చేస్తానని.. ఈ విషయాన్ని ఏడు కొండల స్వామి సాక్షిగా చెబుతున్నానని అన్నారు. చంద్రబాబు రాయలసీమకే కాదు.. కుప్పంను కూడా అభివృద్ధి చేయలేదని పవన్ విమర్శించారు. జగన్‌తో తనకు ఎలాంటి వైరం లేదని పవన్ తెలిపారు.
చట్టసభల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంవల్లే బీజేపీతో విబేధిస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. బీజేపీకి మాత్రమే దేశ భక్తి ఉందా? మిగతా పార్టీలకు దేశభక్తి లేదా? మిగతా పార్టీల నాయకులకు దేశభక్తి లేదా? నోరు అదుపులో ఉంచుకోండి. నేను వాక్‌శుద్ధిని పాటిస్తాను. మీరు యుద్ధానికి సై అంటే నేను రెండుసార్లు సై అంటాను. మీ నాయకులంటే గౌరవం ఉంది. కానీ నేను మీకు బానిసను కానని గుర్తుంచుకోవాలి” అని పవన్ బీజేపీ నేతలకు చురకలు అంటించారు.