పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం వకీల్‌సాబ్. మూడేళ్లు గ్యాప్ తీసుకొని, రిఎంట్రీ ఇస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ పింక్ సినిమాకు రీమేక్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ: ముగ్గురమ్మాయిలకి ఎదురైన చేదు సంఘటన నేపథ్యంలో సాగే కథ ఇది. పల్లవి (నివేదా థామస్), జరీనా (అంజలి), దివ్య (అనన్య నాగళ్ల) ముగ్గురూ ఉద్యోగాలు చేసుకుంటూ ఓ ఇంట్లో అద్దెకుంటారు. అనుకోకుండా ఓ రోజు రాత్రి ముగ్గురూ ప్రయాణం చేయాల్సి వస్తుంది. క్యాబ్ మధ్యలోనే చెడిపోవడంతో మరో కార్‌లో లిఫ్ట్ అడిగి ఓ రిసార్ట్‌కి చేరుకుంటారు. అక్కడ ఎంపీ కొడుకు వంశీ (వంశీ)తో వేముల పల్లవికి చేదు అనుభవం ఎదురవుతుంది. రిసార్ట్ నుంచి తప్పించుకుని ఇంటికొస్తారు. ఆ తర్వాత పల్లవిపై హత్యాయత్నం కేసు నమోదవుతుంది. అమాయకులైన ఆ ముగ్గురమ్మాయిలు కష్టాల్లో పడతారు. న్యాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్లని కాపాడేవారే కరవువుతారు. ఆ సందర్భంలోనే సత్యదేవ్ (వకీల్‌సాబ్) గురించి తెలుసుకుని ఆయన్ని ఆశ్రయిస్తారు. వాళ్ల పరిస్థితిని చూసి రంగంలోకి దిగుతాడు వకీల్‌సాబ్. మరి ఆయన పల్లవి కేసుని గెలిచాడా? కోర్టులో ఆయన వాదనలు ఎలా సాగాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు: వకీల్‌సాబ్‌గా పవన్‌కల్యాణ్ ఒదిగిపోయాడు. కోర్ట్ రూమ్ సన్నివేశాలపై ఆయన మరింతగా ప్రభావం చూపించారు. ప్రథమార్ధంలో వచ్చే సన్నివేశాల్లో ఆయన కాస్త బొద్దుగా ఉన్నట్టు కనిపిస్తారు. నివేదా, అంజలి, అనన్య వారి పాత్రల్లో జీవించారు. నందా పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటన సినిమాకి మరింత బలాన్నిచ్చింది. సాంకేతిక విభాగం పరంగా దర్శకుడు శ్రీరామ్ వేణు పనితనాన్ని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. తమన్ పాటలు, నేపథ్య సంగీతం, పి.ఎస్.వినోద్ కెమెరా పనితనం సినిమాకి అదనపు ఆకర్షణలుగా నిలిచాయి. నిర్మాణపరంగా దిల్‌రాజు ఎక్కడా వెనుకడుగు వేయలేదు. తెరపై అది స్పష్టంగా కనిపిస్తుంది.
విశ్లేషణ: మహిళలు ఎదుర్కుంటున్న సంఘటనల్ని… వాళ్ల విషయంలో సమాజ ధోరణిని ఎత్తి చూపే చిత్రమిది. మహిళలను మరో వంకతో చూసే ధోరణి గురించి ఇందులో వకీల్‌సాబ్ చెప్పిన విషయాలు ఆలోచన రేకెత్తిస్తాయి. మగువా… పాటతో సినిమా మొదలవుతుంది. భిన్నమైన కుటుంబాల నుంచి ముగ్గురమ్మాయిలు తమ కలల్ని సాకారం చేసుకోవడం కోసం నగరానికి చేరుకోవడం, పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా నిలవడం వంటి సన్నివేశాలతో ఆ పాట సాగుతుంది. ముగ్గురమ్మాయిలకి ఎదురైన సంఘటనల తర్వాత వకీల్‌సాబ్‌గా పవన్‌కల్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడ్నుంచి కథ ఊపందుకుంటుంది. సత్యదేవ్ ఫ్లాష్‌బ్యాక్ ఆ తర్వాత పల్లవి కేసు కోసం రంగంలోకి దిగడం వంటి విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి.
ప్రథమార్ధం వరకు అభిమానుల్ని అలరించడమే లక్ష్యంగా సన్నివేశాలుంటాయి. ద్వితీయార్ధంలో కోర్టు రూమ్ డ్రామా సినిమాకు ప్రాణం పోసింది. వాద ప్రతివాదనలు శక్తిమంతమైన పోరాటాల్ని, ఇతరత్రా మాస్ అంశాల్ని తలదన్నే రీతిలో సాగుతాయి. హిందీ చిత్రం ‘పింక్’కి రీమేక్ అయినా… దాన్ని పవన్‌కల్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా తీర్చిద్దారు. అదే సమయంలో కథ పక్కదారి పట్టకుండా బ్యాలెన్స్ చేసిన వైనం మెప్పిస్తుంది. కొన్ని డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి. ప్పవన్‌కల్యాణ్, ప్రకాశ్‌రాజ్ మధ్య కోర్టులో మాటల యుద్ధం ఆకట్టుకుంటుంది.
టైటిల్: వకీల్ సాబ్
నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రుతిహాసన్, ప్రకాశ్ రాజ్, అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ తదితరులు
దర్శకత్వం: శ్రీరామ్ వేణు
నిర్మాత : దిల్ రాజు, శిరీష్
సంగీతం: తమన్
హైలైట్స్: పవన్ కళ్యాన్, ప్రకాశ్ రాజ్ నటన
డ్రాబ్యాక్స్: ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు
చివరిగా:సత్తా చాటిన ‘వకీల్ సాబ్’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)