Pawan Kalyan: బొప్పూడిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు.
”అభివృద్ధిలేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నరేంద్రమోడీ రాక బలాన్నిచ్చింది. ఎన్డీయే పునర్ కలయిక ఐదు కోట్ల మందికి ఆనందాన్ని ఇచ్చింది. మూడోసారి ప్రధానమంత్రి అయి హ్యాట్రిక్ కొట్టబోతున్న మోడీకి ఏపీ ప్రజల తరఫున ఘన స్వాగతం. 2014లో తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రారంభమైన పొత్తు.. ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకోబోతోంది. అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే ఆయన వచ్చారు. అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోంది.
ముఖ్యమంత్రి జగన్ ఒక సారా వ్యాపారిగా మారారు. దేశమంతా డిజిటల్ ట్రాన్సక్షన్ చేస్తుంటే.. ఏపీలోని మద్యం షాపుల్లో మాత్రమే నగదు చలామణి చేసి దోచుకుంటున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. పారిశ్రామిక ప్రగతి 2019లో 10.24 శాతం ఉండగా.. ఈరోజు -3 శాతానికి దిగజారిపోయింది.
అయోధ్యలో రామాలయం కట్టిన మోడీకి .. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన చిటికనవేలంత రావణాసుడిని తీసేయటం కష్టం కాదు. డబ్బు అండ చూసుకుని ఏదైనా చేయగలనని జగన్ విర్రవీగుతున్నారు. గుజరాత్‌లోని ద్వారక నుంచి వచ్చిన మోడీ.. ఎన్నికల కురుక్షేత్రంలో పాంచజన్యం పూరిస్తారు. రామరాజ్యం స్థాపన జరుగబోతోంది. ధర్మానిదే విజయం.. పొత్తుదే గెలుపు.. కూటమిదే పీఠం” అని పవన్ అన్నారు.