మార్పు మొదలైందని.. అది అసెంబ్లీలో కనబడుతుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఓటమి, ఫలితం అనే భయాలు జనసేనకు లేవని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ అభ్యర్థులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో పవన్ మాట్లాడారు. జనసేన మాత్రమే ఆశయంతో పనిచేస్తోందని చెప్పారు. లక్షల మంది యువత తమ వెంట ఉన్నారన్నారు. మార్పు కోసం ఎంత పోరాటం చేశామన్నది ముఖ్యమని చెప్పారు. జనసేన బలాన్ని తక్కువగా అంచనావేయొద్దని ప్రత్యర్థి పార్టీలను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు.
ప్రజారాజ్యం(పీఆర్పీ) సమయంలో చాలా మంది ఆశతో వచ్చారని.. ఎవరూ ఆశయంతో రాలేదని పవన్ విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై దృష్టిపెట్టలేదని.. ఎంత పోరాటం చేశామనేదే తన ఆలోచనని చెప్పారు. ‘మార్పు కోసం మహిళలు చాలా బలంగా నిలబడ్డారు. గెలుస్తారా? లేదా? అనే అంశాన్ని పక్కనపెట్టి భయపడకుండా వచ్చి ఓట్లేశారు. రాజకీయాల్లో ఓపిక, సహనం అవసరం.. గుండె ధైర్యం కావాలి. డబ్బులిచ్చి ఓట్లు కొనాలంటే ఇంతదూరం రావాల్సిన అవసరం లేదు. ఓటమి లోతుల నుంచి బయటకొచ్చా. జనసేన స్థాపించే సమయంలో సీట్ల గురించి ఆలోచన చేయలేదు. ఎక్కడో ఒక చోట మార్పు రావాలని మాత్రమే ఆలోచించా. చాలా మంది సీటు గెలిచి నాకు బహుమతిగా ఇస్తామంటున్నారు. ప్రజాస్వామ్యంలో అలాంటి పదాలకు తావులేదు. పార్టీ నిర్మాణం జరగలేదని సలహాలు ఇస్తున్నారు.. అది అంత తేలిక కాదు. దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. మార్పు మొదలైంది.. అదే మన గెలుపు. మార్పు గొప్ప అంశం.. దాని ముందు ఎమ్మెల్యే అన్నది చిన్న అంశమే’ అని పవన్ వ్యాఖ్యానించారు.