HomeTelugu Big Storiesజైలుకెళ్లిన వారే ప్రశాంతంగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి?.. తానాలో పవన్‌

జైలుకెళ్లిన వారే ప్రశాంతంగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి?.. తానాలో పవన్‌

7 5అమెరికా వాషింగ్టన్‌ డీసీలోని వాల్టర్ ఈ వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తానా 22వ మహాసభలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడో రోజు కార్యక్రమంలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పాల్గొని మాట్లాడారు. వ్యాఖ్యాతలు ఆయనను వేదిక మీదకు పిలవగా నే ‘పీకే‌’ అన్న నినాదంతో సభ హోరెత్తింది. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. తెలుగు భాష గొప్పదనం, ఎన్నికల్లో ఓటమి తదితర విషయాల ఈ సందర్భంగా ప్రస్తావించారు.

‘ఈ సభకు నన్ను ఆహ్వానించిన వారందరికీ ధన్యవాదాలు. ఇప్పటికే నాకెన్నో సార్లు తానా నుంచి పిలుపు అందింది. వివిధ ఆర్గనైజేషన్లు కూడా నన్ను ఆహ్వానించాయి. ఒక సభకు వెళ్తే మరో సభకు వెళ్లలేనేమోనన్న భావనతో ఎక్కడికీ వెళ్లలేకపోయాను. కానీ, తానా ప్రతినిధులకు మాటిచ్చాను. మొదటిసారి మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాను. నాకు జీవితంలో పెద్ద కోరికలు ఏమీ లేవు. సమస్యల్లో ఉన్న ప్రజలకు సాయం చేయడం చిన్నప్పటి నుంచి అలవాటైంది. ఆ ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టాను. ఎన్నికల్లో ఓటమి గురించి ఇంతవరకు నేనెక్కడా మాట్లాడింది లేదు. తొలిసారిగా మీ ముందు మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ థామస్‌ ఆల్వా ఎడిసన్‌ గురించి చెప్తుండేది. ఆయన చేసిన బల్బ్‌ ప్రయోగం గురించే పదే పదే గుర్తు చేస్తుండేవారు. ఓటమి నుంచి పాఠం నేర్చుకోవాలనేది ఆమె సిద్ధాంతం.

‘జనసేన పార్టీ పెట్టేటప్పుడు చాలా ఆలోచించి పెట్టాను. పెద్ద పెద్ద రాజకీయ నేతలందరూ ధైర్యంగా సమస్యల గురించి మాట్లాడక పోవడం ఆశ్చర్యమేసేది. పదవుల కోసం, విజయం గురించి ఆలోచించి పెట్టలేదు. యువత గొంతులో ఉన్న ఆవేదనను నా పైపు నుంచి చెప్పాలనుకున్నాను. ఈ ప్రయాణంలో నేను ఎన్నో ఎదురుదెబ్బలు తింటానని తెలుసు. సినిమాల్లో పేజీలకు పేజీలు డైలాగులు చెప్పడం చాలా తేలిక. కానీ, వాటినే నిజ జీవితంలో చెప్పాలంటే గుండె ధైర్యం కావాలి. మీరిచ్చిన ధైర్యంతోనే నేనిప్పుడు మాట్లాడుతున్నాను. అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి బయట పడటానికి నేను ఎక్కువ సమయం తీసుకోలేదు. బాగా ఆలోచించి 15 నిమిషాల్లో కోలుకోగలిగాను. చిన్నప్పటి నుంచి నాకు ఓటమి అలవాటైంది. గెలుపు నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకున్నానో తెలీదు. కానీ, ఓటమి నుంచి మాత్రం చాలా తెలుసుకున్నాను. నేను స్కాములు, ద్రోహాలు చేసి రాజకీయాల్లోకి రాలేదు. విలువలు కాపాడటానికి వచ్చాను.

‘ఖుషి’ సినిమా తర్వాత నాకు సినిమాల మీద ఆసక్తి తగ్గింది. సినిమాలు ప్రజలపై ప్రభావం చూపవని ఆ చిత్ర వందరోజుల వేడుక రోజు అర్థమైంది. అప్పటి నుంచే సమాజాన్ని చదవడం ప్రారంభించాను. గెలుపు కోసం నేను ఎంత ఓపిగ్గా ఎదురు చూస్తానో మీకు తెలిసిందే. ‘ఖుషి’ తర్వాత నాకు ‘గబ్బర్‌ సింగ్‌’ రూపంలో మరో హిట్‌ లభించింది. ఓటమిని తట్టుకునే శక్తి నెల్సన్‌ మండేలా నుంచి నేర్చుకున్నాను’

‘ప్రస్తుతం మన జీవితాల్ని రాజకీయ వ్యవస్థ శాసిస్తోంది. డబ్బుల్లేకుండా రాజకీయాలు చేయడం కష్టమని తెలుసు. అన్నింటికీ సిద్ధమయ్యే పోటీకి దిగాను. ఈ సభ తర్వాత ఎన్ని కామెంట్లు చేసినా నాకు అభ్యంతరం లేదు. జైలుకెళ్లి వచ్చిన వారే ప్రశాంతంగా ఉన్నప్పుడు సత్యాన్ని మాట్లాడేవాడిని నేనెందుకు భయపడాలి?. ఏ రాజకీయ పార్టీ అయినా సరే.. కులాలు, మతాల దిశగా విడిపోకూడదనేదే నా కోరిక. అనవసర విషయాల గురించి చర్చించడం కాదు. ఎలాంటి వారు పార్లమెంటు, అసెంబ్లీకి వెళ్లాలో వాటి గురించి చర్చించండి.

ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తూ.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా నా స్టార్‌డమ్‌ను మరింత పెంచుకోవచ్చు. కానీ బయటికి వచ్చి ఒక్కరు కూడా సమస్యల గురించి మాట్లాడరు. పాలకులు నియంతల్లాగా ఉంటే ప్రజాభిమానాన్ని కోల్పోతారు. మనది నాయకుడిని ప్రేమించే దేశం. కానీ ఇప్పుడు భయపెట్టే నాయకులున్నారు. వారికేదో ఒకరోజు పతనం తప్పదు. దేశాన్ని ఎవరూ కబంధ హస్తాల్లో బంధించలేరు. ఇక పై నేను ముందుకు వెళ్లడానికి మీ ఆశీస్సులు కావాలి’ అని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu