
Pawan Kalyan about becoming CM:
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను సీఎం కావాలన్న ఆలోచన ఉందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పష్టంగా స్పందించారు.
“నేను వచ్చే 10 నుంచి 15 ఏళ్లలో సీఎం పదవిని ఆశించను. మా లక్ష్యం స్థిరమైన పాలన ఇవ్వడం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టడమే నా ప్రాధాన్యత” అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
అయన మాట్లాడుతూ, “ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నాం. రాష్ట్రం మొత్తం సమగ్రంగా అభివృద్ధి చెందాలి” అన్నారు. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్లు, వసతులు కల్పించే విషయంలో చంద్రబాబుతో కలిసి పని చేస్తున్నానని చెప్పారు.
అరకును ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. “పూర్వ ప్రభుత్వం 90 కిలోమీటర్ల రోడ్లు మాత్రమే వేసింది. కానీ ఎన్డీయే కూటమి ప్రభుత్వం 8 నెలల్లో 1,069 కిలోమీటర్ల రోడ్లు పూర్తి చేసింది. ఇదే తేడా” అని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 3,700 గ్రామాల్లో 1,177 ఆదివాసీ పల్లెలకు ఇంకా రోడ్డు సదుపాయం లేదని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. దీనిని పరిష్కరించేందుకు రూ.1,005 కోట్లను కేటాయించామని వెల్లడించారు. “ప్రతి రూపాయిని జాగ్రత్తగా వినియోగిస్తున్నాం” అని తెలిపారు.
చివరగా, “అరకును నేషనల్ టూరిజం హబ్‌గా మార్చే దిశగా సీఎం చంద్రబాబు, టూరిజం మంత్రి దుర్గేశ్ గారితో చర్చలు జరుపుతాను” అని అన్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ విధమైన ప్రకటనలు, అభివృద్ధి ప్రణాళికలు ప్రజల్లో ఆశాభావం పెంచుతున్నాయి.