జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి బొత్స సత్యనారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బొత్స సత్యనారాయణ మీద త్వరలో ఫోక్స్ వ్యాగన్ కేసు బయటకు వస్తుందనే సంకేతాలు ఇచ్చారు. ‘అమరావతికి శంకుస్థాపన చేసింది మోడీనే. బొత్స అమరావతిని కాదన్నారంటే మోడీని వ్యతిరేకిస్తున్నట్టే. అమిత్ షాను వ్యతిరేకిస్తున్నట్టే. అలా చేస్తే ఫోక్స్ వ్యాగన్ కేసు వస్తుంది.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. నరేంద్ర మోడీ గురించి తనకు తెలుసని, అవినీతిని, అధికార దుర్వినియోగాన్ని సహించే వ్యక్తి కాదని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
బొత్స సత్యనారాయణ.. జగన్ మోహన్ రెడ్డి మాయలో పడొద్దని సూచించారు. ప్రజల ఆగ్రహానికి గురయ్యే చెడు వార్తలను చేరవేసే వారధిగా మారొద్దన్నారు. విధ్వంసానికి సంబంధించిన వార్తలన్నీ బొత్స నోటి నుంచే వస్తున్నాయని, జగన్‌కు దగ్గరగా ఉండే వారి నుంచి ఇలాంటి మాటలేవీ రావడం లేదని పవన్ కళ్యాణ్ విశ్లేషించారు. ‘గతంలో పీసీసీ చీఫ్‌గా పనిచేశారు. ఏపీకి చివరి సీఎం కావాలని అనుకున్నారు. భవిష్యత్తులో సీఎం కావాలని మారుమూల కోరిక ఉంది. దానికి ప్రజల అభిమానం సంపాదించాలి. జాగ్రత్తగా మాట్లాడండి.’ అని పవన్ కళ్యాణ్ బొత్స సత్యనారాయణను ఉద్దేశించి కామెంట్ చేశారు.