Pawan Kalyan:ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్తరం కాబోతున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లోపోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే వీరితో బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తున్నాయి ఇరు పార్టీలు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీకి రావాలంటూ చంద్రబాబును పిలిచి చర్చలు జరిపారు. అయితే దానిగురించి ఇంకా స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.
ఇవాళ ఢిల్లీలో ఏపీలో పొత్తులపై అమిత్ షా స్పందిస్తూ మేము మా మిత్రులను ఎవరినీ దూరం చేసుకోము. కొన్ని పార్టీలు ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలతో వారు దూరం అయ్యారు. త్వరలోనే పొత్తులపై స్పష్టత వస్తుందని అన్నారు. రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నట్లు అమిత్ షా వెల్లడించారు. ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబానికి బాగుంటుంది కానీ రాజకీయాలకు కాదు అన్నారు. మరోవైపు ఏపీలో అధికార పార్టీ వైసీపీ మాత్రం ఒంటరిగానే పోటీకి వెళ్తోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన నాయకులకు ఇవాళ కీలకమైన సూచనలు చేశారు. పొత్తులపై ఎవరూ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడొద్దని అన్నారు. ఏపీ ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసమే ప్రాధాన్యత ఇస్తూ జనసేన పొత్తులు దిశగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. పొత్తులపై ఇంకా చర్చల జరుగుతున్నాయని అన్నారు.
పార్టీలో ఎవరికైనా విభిన్న అభిప్రాయాలు ఉంటే తన దృష్టికి తేవాలని పవన్ తన నేతలకు సూచించారు. అంతేగాని భావోద్వేగాలతో ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దని అన్నారు. ఒకవేళ అలాంటి వ్యాఖ్యలు చేసినట్లయితే రాష్ట్ర ప్రయోజనాలకువిఘాతం కలిగించిన వారవుతారని అన్నారు. అలాంటి వారినుంచి పార్టీ వివరణ తీసుకోవాల్సి వస్తుందని నాయకులకు ఆదేశించారు.