జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నల్లమలలో.. యురేనియం తవ్వకాలు వద్దన్నారు. యురేనియం తవ్వకాలపై అఖిలపక్షంతో చర్చించి ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు ఆయన. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు జనసేన కార్యాలయంలో పవన్‌తో భేటీ అయ్యారు. యురేనియం తవ్వకాల వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వాలని వీహెచ్ ఆయన్ను కోరారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలతో పర్యావరణానికి నష్టం చేకూరుతుందని.. జీవవైవిధ్యం నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు జనసేన అధినేత. యురేనియం తవ్వకాలతో అక్కడి ప్రజలకు క్యాన్సర్, మూత్రపిండ సమస్యలు తలెత్తే ప్రమాదముందని పవన్ అన్నారు.
ఈ తవ్వకాలతో కృష్ణా జలాలు కలుషితమవుతాయని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముప్పు ఉంటుందని పవన్ చెప్పారు. ఇప్పటికే చెంచులు ఈ విషయాన్ని జనసేన దృష్టికి తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామని, పర్యావరణ శాస్త్రవేత్తలు, నిపుణులతో మాట్లాడి ప్రజల్లోకి వెళ్తామని పవన్ స్పష్టం చేశారు. అఖిలపక్ష భేటీ నిర్వహణపై రెండు మూడు రోజుల్లో చెబుతామని అన్నారు. అనంతరం వీహెచ్ మాట్లాడుతూ యురేనియం తవ్వకాలు తెలుగు రాష్ట్రాల సమస్య అని అదే జరిగితే నల్లమల ప్రాంతంలో జీవవైవిధ్యం దెబ్బతిని జంతువులు మృత్యువాత పడతాయని అన్నారు.