ఏపీలో ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తాను రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ జనసేన పార్టీకి చెందినవారు ఒక్కరు కూడా గెలవకపోయినప్పటికీ తుదిశ్వాస వరకు రాజకీయాల్లోనే కొనసాగుతానని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని.. ప్రజా సమస్యలపై పోరాడుతూ వారికి అండగా నిలుస్తామన్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన వైసీపీకి, సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్‌కు, దేశంలో రెండోసారి
ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో ఇచ్చిన హామీని మోదీ నిలబెట్టుకోవాలని అభ్యర్థిస్తున్నానని అన్నారు. సుదీర్ఘకాలం మార్పు కోసం జనసేన స్థాపించానని ఎన్ని రకాల ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొనే సత్తా, ధైర్యం మాకు ఉంది అన్నారు. అన్నింటికీ సిద్ధపడే పార్టీ పెట్టామని, మా పార్టీకి ఓటు వేసిన ప్రతి ఓటరుకూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. డబ్బులు పంచకుండా, ఓటర్లను ప్రభావితం చేయకుండా క్లీన్ పాలిటిక్స్ చేయడం, నవ యువకులకు టికెట్లు ఇవ్వడం.. వంటి పనులు మాకెంతో ఆనందాన్ని
కల్గించాయని పవన్ కల్యాణ్ తెలిపారు.