ఏపీ శాసన మండలి రద్దు చేస్తూ శాసనసభ తీసుకున్న నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పునరుద్ధరించిన మండలిని ఇప్పుడు రద్దు చేయడం సరికాదని పవన్ తెలిపారు. శాసన మండలి రద్దు తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో పవన్ ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగ రూపకర్తలు ఎంతో ముందుచూపుతో రాష్ట్రాల్లో రెండు సభల ఏర్పాటుకు అవకాశం కల్పించారన్నారు. శాసనసభలో పొరపాటు నిర్ణయం తీసుకున్నప్పుడు దానిపై పెద్దల సభలో మేథోపరమైన మథనం కోసమే ఉన్నతాశయంతో మండలి ఏర్పాటైందని అన్నారు.
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదించలేదనే కారణంతో ఏపీ శాసన మండలిని రద్దు చేయడం సహేతుకం కాదని పవన్ కల్యాణ్ ఆరోపించారు. రాజ్యాంగ రూపకర్తలు ముందుచూపుతో మండలికి అవకాశమిచ్చారని పవన్ చెప్పారు. కొన్ని బిల్లులపై అసెంబ్లీలో తీసుకునే పొరపాటు నిర్ణయాలను సరిదిద్దేందుకే మండలిని ఏర్పాటు చేశారని పవన్ అన్నారు. మండలిని రద్దుచేసే ప్రత్యేక పరిస్థితులేవీ ప్రస్తుతం రాష్ట్రంలో లేవన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల్లో శాసన మండలిని రద్దు చేయడం సబబు కాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థలను తొలగించుకుంటూ పోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. శాసన మండలి రద్దుకు ప్రజామోదం ఉందా? లేదా? అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఆయన విమర్శించారు. వికేంద్రీకరణ బిల్లు మండలిలో నిలిచిపోతే దానిని రద్దు చేయడం సహేతుకంగా లేదన్నారు. మండలి
రద్దుతో మేధావుల ఆలోచనలను రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించే అవకాశాన్ని మనం కోల్పోయినట్లేనని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.